Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్
Bandi Sanjay : ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు.
Bandi Sanjay : తెలంగాణలో బెంగాల్ తరహా పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ములుగులో బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి గిరిజనులకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు. నేను కేసీఆర్ ను సవాల్ చేస్తున్నా.... ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దమ్ముందా?’’ అని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 9 ఏళ్లలో గిరిజనుల కోసం ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బెంగాల్ తరహా పాలన సాగుతోందని మండిపడ్డ బండి సంజయ్.. ప్రశ్నించే వాళ్లను జైళ్లకు పంపుతూ భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. బిడ్డను, కొడుకును కాపాడుకునేందుకు కేసీఆర్ తెలంగాణ ప్రజల జీవితాలను ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతుందో బీఆర్ఎస్ నాయకులంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. నందినగర్ లోని ఇంటికే పరిమితమైన కేసీఆర్ కుటుంబం వేల కోట్లు ఎట్లా సంపాదించారు? విదేశాల్లో పెట్టుబడులు ఎట్లా పెడుతున్నారు? దొంగ సారా దందాకు వందల కోట్లు ఎక్కడివో ప్రజలంతా ఆలోచించాలని సూచించారు.
ములుగు జిల్లా కేంద్రంలో పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళానికి బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ సునీల బన్సల్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు మండలాల బీజేపీ అధ్యక్షులను సంజయ్ ఘనంగా సన్మానించారు. అంనతరం బండి సంజయ్ మాట్లాడారు.
కేసీఆర్ సర్వేలో బీజేపీ విజయం
"హిందువుల పండుగ వేళల్లో షాపులు మూసేస్తారా?. ఇతరుల పండుగలకు మాత్రం తెల్లవార్లు షాపులు తెరిచినా పట్టించుకోరా? రంజాన్ సమయంలో పాతబస్తీలో డ్రంకన్ డ్రైవ్ ఎందుకు చేయడం లేదు? తెలంగాణలో హిందువులకో న్యాయం? ఇతరులకో మరో న్యాయమా? పాకిస్థాన్ గెలిస్తే సంబురాలు చేసుకునే బీఆర్ఎస్ వంటి పార్టీలు అవసరమా? 80 శాతం హిందువులున్న దేశంలో రామమందిరం కోసం బలిదానాలు చేయాల్సి రావడమా? తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని హేళన చేసినోళ్ల నోళ్లు ఉపఎన్నికల్లో గెలుపుతో మూయించినం. ములుగులోనూ బీజేపీ గెలుపు తథ్యం. ములుగు పవిత్రమైన గడ్డ. నక్సలైట్లు చంపుతామని భయపెట్టినా బుల్లెట్ దింపినా వెరవకుండా కాషాయ జెండాను ఎగరవేసేందుకు ప్రాణాలనే అర్పించిన పూజారి మాణిక్యం జన్మించిన గడ్డ ఇది. ఆయన ఆశయం నెరవేరబోతోంది. కాషాయ కాంతి నుంచి వచ్చే భగభగ మంటలకు రంగురంగుల జెండాలన్నీ దగ్ధమైపోవాల్సిందే. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా, చివరకు కేసీఆర్ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారు. అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వబోతున్నారని తెలిసి కేసీఆర్ గుండెల్లో డప్పులు కొడుతున్నయ్. బీజేపీ అధికారంలోకి వస్తే రేయాన్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. 5 వేల మంది పొట్ట కొడుతున్న కేసీఆర్ కు బుద్ది చెప్పండి. ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి." - బండి సంజయ్
మళ్లీ కేసీఆర్ గెలిస్తే చేతికి చిప్ప తథ్యం
గిరిజన రిజర్వేషన్లను ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి అడ్డుకున్న ఘనుడు కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలని సవాల్ చేశారు. కుర్చీ వేసుకుని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని అడుగడుగునా మోసం చేస్తున్నారన్నారు. గిరిజన ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటిస్తే.. ఆమెను ఓడగొట్టేందుకు కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు కేసీఆర్ అన్నారు. రుణమాఫీ చేయడానికి పైసల్లేవని చెబుతున్న కేసీఆర్ దుబాయి, మస్కట్ లో ఎట్లా పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. మోదీ కేబినెట్ లో 12 మంది ఎస్టీలను కేబినెట్ మంత్రులుగా చేస్తే కేసీఆర్ కేబినెట్ లో ఒక్కరికి మాత్రమే అవకాశమిచ్చి గిరిజన ద్రోహి కేసీఆర్ అన్నాకుయ కేంద్రం తెలంగాణను అభివృద్ధి చేసేందుకు సిద్దంగా ఉన్నా మోదీకి, బీజేపీకి పేరొస్తుందనే సాకుతో అడ్డుకుంటున్నారన్నారు. కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పు చేశారని, పొరపాటున మళ్లీ గెలిస్తే మరో రూ. 5 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల చేతికి చిప్ప ఇవ్వడం తథ్యం అన్నారు.