పార్టీ మారేది లేదు, దుబ్బాక నుంచి తగ్గేది లేదు: ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత పదేళ్లలో గజ్వేల్ లో ఎలాంటి చేశారో చూద్దామని పిలుపునిచ్చామన్నారు. ముందురోజే తమను అరెస్ట్ చేసిన పోలీసులు బిచ్కుంద పోలీసు స్టేషన్ తీసుకెళ్లారని తెలిపారు. ఆ స్టేషన్ లో కేసు నమోదు చేయలేదన్నారు రఘునందన్ రావు. దీంతో కామారెడ్డి నుంచి బస్సులో గజ్వేల్ వస్తే భయం ఎందుకని నిలదీశారు.
గజ్వేల్ అభివృద్ధి చూసేందుకు మహారాష్ట్ర రైతులు, ప్రశాంత్ కిశోర్, ప్రకాష్ రాజ్ లకు అవకాశం ఉంటుందని..తమను ఎందుకు రానివ్వరని ప్రశ్నించారు రఘునందన్ రావు. చెప్పకుండా ఏదో ఒక రోజు గజ్వేల్‌కు వస్తానన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కాళేశ్వరం చూడటానికి వచ్చిన వారికి హెలికాప్టర్లు ఏర్పాటు చేసిన కేసీఆర్.. పక్క నియోజకవర్గం నేతలు గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు వెళ్తే అంత ఉలికిపాటు ఎందుకన్నారు. గజ్వేల్ బస్ స్టాండ్ ఎలా ఉందో.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకుంటామన్నారు. ఎల్లప్పుడు బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోనే ఉండదన్న ఆయన పోలీసులు జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. జరుగుతున్న పరిణామాలన్నింటిపై రానున్న రోజుల్లో డీజీపికి బరాబర్ సమాధానమిస్తామని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
రెండు నెలల క్రితం పార్టీ హైకమాండ్ ను ధిక్కరించేలా వ్యవహరించారు రఘునందన్ రావు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హుడిని కాదా? అని ప్రశ్నించిన ఆయన.. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్‌లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరారు. దుబ్బాక ఎన్నికల్లో తనకెవరూ సాయంచేయలేదన్న రఘునందన్ దుబ్బాకలో తనను చూసే గెలిపించారని గుర్తు చేశారు. మునుగోడు ఎన్నికలు ఓటమి తర్వాత బండి సంజయ్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. వంద కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీ అభ్యర్థి గెలవలేదని రఘునందన్ విమర్శించారు. పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్.. వంద కోట్లతో యాడ్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ బొమ్మలతో ఓట్లు రావని రఘునందన్, ఈటల బొమ్మలతోనే ఓట్లు వస్తాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో పార్టీ గుర్తు చివరి అంశమేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర నాయకత్వానికి, రఘునందన్ రావుకు మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయ్.
చదువు పూర్తయిన తర్వాత ఐదేళ్ల పాటు జర్నలిస్టుగా పని చేశారు. లా కోర్సు చేసి ఉమ్మడి హైకోర్టు బార్ అసోసియేషన్ లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఎంపీ అసదుద్దీన్ కేసు వాదించడంతో పాపులరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడిగా రఘునందన్ రావు రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ పని చేశారు. 2014లో దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నికలు వచ్చారు. 2020లో ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి 1074 ఓట్ల తేడాతో విజయం సాధించారు.