MLA Athram Sakku: పులి దాడిలో చనిపోయిన సిడాం భీము కుటుంబాన్ని ఆదుకుంటాం- ఎమ్మెల్యే ఆత్రం సక్కు
MLA Athram Sakku: పులి దాడిలో చనిపోయిన సిడం భీము కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందేజశారు.
MLA Athram Sakku: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. సిడాం భీముకు ఎల్లపుడూ అండగా ఉంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని చౌపన్ గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో ఇటీవల పులి దాడిలో అదే గ్రామానికి చెందిన సిడాం భీము మరణించాడు. ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషీయా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన 5 లక్షల రూపాయల చెక్కును ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీఎఫ్ఓ దినేష్.. మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ముందుగా సిడాం భీము కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ డాక్టర్ అజయ్ కుమార్, స్థానిక సర్పంచ్ సిడాం అన్నిగా, ఐటీడీఏ డైరెక్టర్ సోయం భీంరావు, సర్పంచులు కిస్టు, జంగు, దేవురావు నాయక్, ఎంపీటీసీ ఆత్రం రాంబాయి, నాయకులు దీపక్ ముండే, దుర్వా లక్ష్మణ్, బాపురావ్, మాన్కు, ఆదివాసీ నాయకులు, అధికారులు, టిఆర్ఎస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పది రోజుల క్రితం పులి దాడిలో సిడాం భీమ్ మృతి..
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్ గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. చౌపన్ గూడ పంచాయతీ పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీము (69) అనే రైతు చేనులో పనిచేస్తుండగా పెద్దపులి ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొంత దూరం రైతు మృతదేహాన్ని లాక్కెళ్లింది. స్థానికులు అరుపులతో రైతు మృతదేహాన్ని వదిలి పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని దాడి జరిగిన తీరును, పరిసరాలను పరిశీలిస్తున్నారు. పక్కనున్న మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యంలో కొద్దిరోజుల క్రితం ఇద్దరు వ్యక్తులను పులి దాడి చేసి హతమార్చింది. దీంతో ఆ పులే ప్రస్తుతం ఇటువైపు వచ్చినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. కుమురం భీం జిల్లాలో ఇప్పుడు సిడాం భీము అనే రైతు పై పులి దాడిచేసి హతమార్చడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
పశువులపై దాడి..
ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి, పెంచికల్ పేట్, కాగజ్‌నగర్ పరిసర అటవి ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కాగజ్‌నగర్ మండలం కొసిని, రేగలగూడ, అనుకోడ సమీప అటవీ ప్రాంతాల్లో పశువులపై పెద్దపులి దాడి చేసింది. ఇటీవల చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్ మండలాల్లోను పులి రెండు పశువులను హతమార్చింది. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తు అలజడి సృష్టించింది. కొసిని రేగలగూడ అటవి ప్రాంతంలో భీమేష్ అనే పశువుల కాపరి పశువులను కాస్తుండగా ఒక్కసారిగా పెద్దపులి ఓ ఆవుపై దాడి చేసింది. ఆవుపై పులి దాడి చేయడాన్ని పశువుల కాపరి భీమేష్ కళ్లారా చూశానని చెప్పాడు. పక్కనున్న వారిని పిలిచి కేకలు వేయడంతో పులి కాసేపటికి ఆవును వదిలి అక్కడ నుంచి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని చెప్పాడు.