Talasani Srinivas: ఎవరుపడితేవాళ్లు అడిగితే ఇచ్చేవి కావు - నంది అవార్డ్స్‌పై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
నంది అవార్డుల గురించి సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమను అడగలేదని తలసాని చెప్పారు. నంది అవార్డులను ఎవరు పడితే వాళ్లు అడిగితే ఇచ్చేవి కావని మంత్రి తలసాని అన్నారు.
టాలీవుడ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి గతంలో నంది అవార్డులను ప్రభుత్వం అందిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఓసారి నంది అవార్డులను ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, కొన్నేళ్లుగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నంది అవార్డుల కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం లేదు. తాజాగా నంది అవార్డుల అంశంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. నంది అవార్డుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమను అడగలేదని చెప్పారు. కొందరు మీడియా కనిపించగానే అత్యుత్సాహాంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నంది అవార్డులను ఎవరు పడితే వాళ్లు అడిగితే ఇచ్చేవి కావని మంత్రి తలసాని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది సినిమా వారికి నంది అవార్డులు ఇచ్చే ఆలోచన చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ మణికొండ సమీపంలోని చిత్రపురి కాలనీలో దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కొంత మంది సినీ ప్రముఖులు చేస్తున్న విమర్శలపై మంత్రి తలసాని స్పందించారు.
బాధ్యతాయుతమైన వ్యక్తులెవరూ నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించలేదని చెప్పారు. సినీ పరిశ్రమకు ఏ ఆటంకం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకారాన్ని అందిస్తుందన్నారు. సినీ పరిశ్రమకు సహకారం విషయంలో ప్రభుత్వాన్ని చాలాసార్లు ప్రశంసించారని మంత్రి గుర్తు చేశారు. సింగిల్ విండో విధానంలో షూటింగులకు అనుమతి ఇవ్వడం, ఐదో షో ఆటకు అనుమతి ఇవ్వడం సహా ఎన్నో రకాలుగా టాలీవుడ్ కు ప్రభుత్వం అనుకూలంగా ఉంటోందని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర విభజన జరిగాక నంది అవార్డులు ఆపేసిన మాట వాస్తవమేనని అన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంది అవార్డులు ఇస్తామని ప్రకటించారు. ‘‘దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. చిత్రపురి కాలనీ కోసం దాసరి ఎంతో కృషి చేశారు. చిత్ర పరిశ్రమకు ఏ ఆపద వచ్చినా ముందడుగు వేసిన వ్యక్తి దాసరి. ఆయన చిత్రాలు మంచి సందేశాత్మకంగా ఉండేవి. దాసరి మరణం తర్వాత సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు లేకుండా పోయింది’’ అని మంత్రి తలసాని అన్నారు.
ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్ మాటలతోనే వివాదం
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగాళ్లకు మోసగాడు రీరిలీజ్ చేయనున్న వేళ, నిర్మాతలు ఆదిశేషగిరి రావు, అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు రెండు రోజుల క్రితం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇవ్వాలన్న ఆసక్తి రెండు ప్రభుత్వాలకూ లేదని అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ అవార్డుకు విలువ ఉండేదని అన్నారు. ఇప్పుడు ఆ అవార్డుకు విలువ లేకుండా పోయిందని మాట్లాడారు.