KTR Davos : తెలంగాణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ తయారీ కేంద్రం - దావోస్‌లో మంత్రి కేటీఆర్ ప్రకటన !
దావోస్‌లో మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని పెట్టే అవకాశం ఉందన్నారు.
KTR Davos : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ దావోస్‌లో తెలిపారు. తెలంగాణ సర్కార్ మౌళిక సదుపాయాల కల్పన తో పెట్టుబడులు ఆకర్షిస్తోందని మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల వైద్య రంగంలో ఉన్న లోపాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించాయని, కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తమ దగ్గర కావాల్సినన్ని వెంటిలేటర్లు లేవని న్యూయార్క్ గవర్నర్ అన్నారని, ఆ పరిస్థితుల్ని అంచనా వేస్తే, లైఫ్ సైన్సెస్‌కు పెద్దపీట వేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. మూడో వంతు వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలోనే 40 శాతం ఫార్మసీ ఉత్పత్తులు జరుగుతున్నాయన్నారు.
కరోనా ఒక్కటే కాదు, ఇతర మహమ్మారులు ఏవి వచ్చినా వాటిని ఎదుర్కొనే రీతిలో వ్యాక్సిన్లు కావాలన్న నిర్ణయం చేశామని కేటీఆర్ ప్రకటించారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ఉత్పత్తి అంశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను సంప్రదించామని, దాని గురించి వాళ్లు కూడా ఆసక్తి ప్రదర్శించారని, త్వరలోనే తెలంగాణలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హబ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబోతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.తెలంగాణ, కేంద్రం మధ్య సరైన సంబంధాలు లేవన్న అంశాన్ని కొన్ని మీడియా సంస్థలు ఆయన వద్ద ప్రస్తావించారు. తెలంగాణ తరహాలో మిగితా రాష్ట్రాలన్నీ పరిపాలన సాగిస్తే, మన దేశం ఎప్పుడో 5 ట్రలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేదని అన్నారు. కేంద్రం సహకరించడం లేదన్నారు.
దేశంలో అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రోత్ రేటు(సీఏజీఆర్) 15 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కోవిడ్ ఉన్నా.. నోట్ల రద్దు చేసినా.. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటులో దూసుకువెళ్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఒకవేళ కేంద్రం తమకు సహకరించి ఉంటే, తెలంగాణ మరింత వేగంగా వృద్ధి సాధించేదన్నారు.మోదీ ఈ దేశ ప్రధాని కావడానికి ముందు భారత దేశ అప్పు 56 లక్షల కోట్లు ఉండేదని, కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత ఆ అప్పు విపరీతంగా పెరిగిందన్నారు. గత 8 ఏళ్ల పాలనలో.. అంటే మోదీ పరిపాలనలో దేశం కొత్తగా వంద లక్షల కోట్లు అప్పుల పాలైనట్లు మంత్రి కేటీఆర్ విమర్శించారు.
గడిచిన 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఖజానాకు 3 లక్షల 68 వేల కోట్లు సమర్పించిందని, కానీ తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చింది కేవలం లక్షా 68 వేల కోట్లే అని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తమకు వచ్చిన దాని కన్నా ఎక్కువే కేంద్రానికి సమర్పించిందని ఆయన వెల్లడించారు. అత్యధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తమకు సూచనలు చేయడం జోక్ అవుతుందని కేటీఆర్ అన్నారు. కేంద్ర సర్కార్ నెగటివ్ ఆలోచనలు, హానికరమైన భావనల వల్ల దేశ వృద్ధి కుంటుపడుతుందని కేటీఆర్ మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. దావోస్‌లో పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ మాట్లాడారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేశఆరు.