KTR Challenge: నిజమని నిరూపించండి రాజీనామా చేస్తా, అమిత్ షా ముక్కుల నేలకు రాస్తారా? - కేటీఆర్ సవాల్
KTR In Mahabubnagar: దేవరకద్ర నియోజకవర్గంలో శనివారం పర్యటించిన ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయంలో నిజాలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. రాష్ట్రానికి కేంద్రం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. లేదంటే అమిషా తప్పు అంగీకరించి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హాదా ఇస్తామని చెప్పి, 8 ఏళ్లలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. వికారాబాద్ నుంచి కర్ణాటకకు, గద్వాల – మాచర్ల రైలు మార్గం అడిగినా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.3.65 లక్షల కోట్లు పన్నుల రూపంలో ఇస్తే వాళ్లు ఇచ్చింది రూ.1.68 లక్షల కోట్లేనని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో శనివారం పర్యటించిన ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం బహిరంగ వేదికపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలం వెంకపల్లిలో రూ.55 కోట్లతో పేరూరు ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వర్నె వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రూ.18 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూత్పూర్ మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. అమిస్తాపూర్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కేటీఆర్ ఆరోపించారు. అభివృద్ధి పనుల్లో పోటీ పడాలి గానీ, మసీదులు తవ్వడం, మత విమర్శలు చేయడం వంటి అంశాల్లో కాదని అన్నారు. ప్రతిసారి కుల, మతాల పేరుతో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నించకూడదని హితవు పలికారు.
అంతేకాకుండా, ఈ 8 ఏళ్లుగా కృష్ణా జలాల్లో 575 టీఎంసీల నీటి వాటాను తెలంగాణ అడుగుతుంటే కేంద్రం ఏమీ స్పందించడం లేదని అన్నారు. పైగా కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ‘‘ కొత్తకోట మున్సిపాలిటీకి త్వరలో రూ.4 కోట్లు మంజూరు చేస్తాం. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ పాలనలో ఎన్నో మంచి కార్యక్రమాలు మొదలుపెట్టాం. దేవరకద్రను పురపాలిక కేంద్రంగా ఏర్పాటు చేస్తాం. పురపాలిక కేంద్రం ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తాం’’ అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
కృష్ణా జలాల విషయంలో ఎనిమిదేళ్లుగా మన వాటా అడుగుతున్నా కేంద్ర బీజేపీ సర్కారు నుంచి ఉలుకు పలుకు లేదు: మంత్రి శ్రీ @KTRTRS. pic.twitter.com/yJXMAmeD21
— TRS Party (@trspartyonline) June 4, 2022