Komati Reddy Chit Chat : యాదాద్రి కాదు ఇక యాదగిరి గుట్ట - త్వరలో జీవో ఇస్తామన్న మంత్రి కోమటరెడ్డి
KomatiReddy : యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ జీవో ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే హరీష్ రావు కూడా బీజేపీలోకి వెళ్తాడని జోస్యం చెప్పారు.
![Komati Reddy Chit Chat : యాదాద్రి కాదు ఇక యాదగిరి గుట్ట - త్వరలో జీవో ఇస్తామన్న మంత్రి కోమటరెడ్డి Minister Komati Reddy announced that the name of Yadadri will be changed to Yadagiri Gutta Komati Reddy Chit Chat : యాదాద్రి కాదు ఇక యాదగిరి గుట్ట - త్వరలో జీవో ఇస్తామన్న మంత్రి కోమటరెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/9459641c4365f101cd21f14a16d1a2f11709365545739228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Komati Reddy Chit Chat : యాదాద్రి కాదు ఇకపై యాదగిరిగుట్టగా పిలువబుడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీఓ విడుదల చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. ఆయన శనివారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘ఎమ్మెల్యే కేటీఆర్ ఇప్పటికీ తండ్రి కేసీఆర్ చాటు కొడుకే. నేను ఉద్యమాలు చేసి వచ్చాను. మేం జీరో బిల్ ఇచ్చినట్టు.. కేటీఆర్‌కి జీరో నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వృథా. ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ కూడా బీజేపీలోకి పోతాడు. కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదు?. కాళేశ్వరం పనికిరాదని ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజలే కేసీఆర్‌ను నామరూపాలు లేకుండా చేశారు. ఎంపీ అభ్యర్థులపై అంతర్గత సర్వే జరుగుతోంది. భువనగిరి నుండి పోటీ చేయమని రాహుల్ గాంధీని కోరాను. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో.. దక్షిణాదిలో టాప్ మెజార్టీ వస్తుంది. మోదీ కంటే రాహుల్ గాంధీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
యాదగిరి గుట్ట ను కేసీఆర్ సీఎం అయిన తర్వాత అభివృ్దధి చేశారు. యాదాద్రిగా పేరు మార్చారు. కానీ యాదగిరిగుట్టగానే ఎక్కువ మంది పిలుస్తున్నారు. అదేపేరు ఉండాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరోసారి తెరపైకి వచ్చింది. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రెండు రోజుల కిందట ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తారని చెప్పారు. ఆలయ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చారు. నెల రోజుల్లోగా సమీక్ష సమావేశం నిర్వహిస్తామని అయిలయ్య వెల్లడించారు.
క్షేత్రానికి పూర్వం నుంచి ఉన్న పేరును మార్చడం సరికాదన్న అయిలయ్య.. తిరిగి యాదగిరిగుట్టగా పేరు మార్చే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అయితే యాదగిరిగుట్టగా ఉన్న పేరును మాజీ సీఎం కేసీఆర్ యాదాద్రిగా మారుస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుమల వెంకన్న ఆలయం స్థాయిలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో యాదాద్రి అని నామకరణం చేస్తూ.. ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించినప్పుడు ప్రకటించారు.
యాదాద్రి పేరును చినజీయర్ స్వామి సూచించారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తారనే వార్తలు వచ్చాయి. క్షేత్ర పర్యటనకు అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ వచ్చిన సమయంలో యాదగిరిగుట్ట అనే పేరుతోనే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలు విడుదల చేసింది. దీంతో గుడి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే దానిపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేసే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)