(Source: ECI/ABP News/ABP Majha)
Karumuri Nageswara Rao: మా రాష్ట్రం గురించి మీకెందుకు? ఏపీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కారుమూరి ఫైర్
Karumuri Nageswara Rao: ఏపీలోని రోడ్లు, ధాన్యం కొనుగోళ్ల గురించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రియాక్ట్ అయ్యారు. మా రాష్ట్రం గురించి మీకెందుకని ప్రశ్నించారు.
Karumuri Nageswara Rao: ఎన్నికల నేపథ్యంలో మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకునేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. అందులో భాగంగా కాంగ్రెస్‌కు షర్మిల మద్దతు తెలపడంపై బీఆర్ఎస్ విమర్శలు కురిపిస్తోంది. తెలంగాణను వ్యతిరేకించిన ఆంధ్రా ద్రోహులైన షర్మిల మద్దతును కాంగ్రెస్ తీసుకుందంటూ బీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తోన్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అమరావతిలా మారిపోతుందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఏపీతో పోలుస్తూ తెలంగాణలో జరిగిన అభివృద్దిని ప్రచారంలో కేసీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రతీ సభలోనూ ఏపీ పేరును కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు.
ఇటీవల ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఏపీ రోడ్ల పరిస్థితి గురించి కేసీఆర్ సెటైర్ వేశారు. డబుల్ రోడ్లు వస్తే తెలంగాణ అని, అదే సింగిల్ రోడ్ వస్తే ఏపీ అని తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతోన్నాయి. కేసీఆర్ కామెంట్స్‌పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఓట్ల కోసం మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేసీఆర్ కామెంట్స్‌పై శుక్రవారం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. ఓట్ల కోసం కేసీఆర్ ఇచ్చమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, పదే పదే ఏదేదో ఏపీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో ధాన్యం అమ్ముకుంటున్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కారుమూరి సీరియస్ అయ్యారు.
ఏపీలో ధాన్యం కొనడం లేదని కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని, తాము ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు మూడు రోజుల్లో రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామని కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. కేసీఆర్ అసత్యాలు మాట్లాడుతున్నారని, ఏపీలో ఉత్పత్తి అయ్యే సన్నబియ్యాన్ని తెలంగాణలో తినడం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అక్కడి రాజకీయాలు చూసుకోవాలని, ఏపీతో ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయా? అని ప్రశ్నించారు. పదేళ్లుగా కేసీఆర్ సీఎంగా ఉన్నారని, చిన్న వర్షానికే హైదరాబాద్ మునిగిపోతుంటే ఏం చేశారు? అని కారుమూరి ప్రశ్నించారు. ఏపీలో తాము ఇంటింటికి సార్టెక్స్ బియ్యం ఇస్తున్నామని, తెలంగాణలో ఇవ్వడం లేదు కదా? అని అన్నారు.
ఇక్కడ తాము ఇచ్చినన్నీ సరుకులు తెలంగాణలో ఇవ్వడం లేదన్నారు. కరోనా సమయంలో అసలు ప్రజలను కేసీఆర్ పట్టించుకోలేదని, తాము ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు మేలు చేశామని కారుమూరి తెలిపారు. ఏపీని కించపరుస్తూ కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. అటు కేసీఆర్ వ్యాఖ్యలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలపై ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల కోసమే ఏపీ రోడ్లపై ఆయన కామెంట్స్ చేస్తున్నారని, కానీ పెన్షన్ల విషయంలో జగన్‌ను కేసీఆర్ పొగిడారని సజ్జల చెప్పారు. తాము సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా నిలిచామని, రాష్ట్రంలో అనేక సమూల మార్పులు తీసుకొచ్చామని అన్నారు. ఎక్కడ ఏం చేశామో తమకు తెలుసని సజ్జల అన్నారు.