Marri Sasidhar Reddy : ఢిల్లీ వచ్చింది పార్టీ మారడానికి కాదు - భగ్గుమన్న కాంగ్రెస్ నేత !
తాను బీజేపీలో చేరేందుకు ఢిల్లీ రాలేదని మర్రి శశిధర్ రెడ్డి ప్రకటించారు. అలాంటి ప్రచారం తప్పని ఆయన ప్రకటించారు.
Marri Sasidhar Reddy : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం ఒక్క సారిగా తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. డీకే అరుణతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారని బీజేపీ హైకమాండ్ పెద్దలను కలిసి ఆ పార్టీలో చేరుతారని ఒక్క సారిగా గుప్పుమంది. అయితే ఈ ప్రచారంపై మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు.. వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి వెళ్లడం కొత్త కాదని, మనవడి స్కూల్ ఫంక్షన్ లో పాల్గొనేందుకు ఇప్పుడు వచ్చినట్లు చెప్పారు. తానింకా రాజకీయాల్లో ఉన్నానని, రిటైర్ కాలేదని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఒకే విమానంలో డీకే అరుణ, మర్రి శశిధర్ రెడ్డి ప్రయాణించడంతో పార్టీ మార్పు ప్రచారం
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆయన వెంట ఉన్నారన్న వార్తలపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చిన విమానంలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారని తెలిపారు. ఆయన.. బీజేపీలో చేరేందుకే ఢిల్లీకి వచ్చానంటూ పుకార్లు పుట్టించడం సరికాదన్నారు. మర్రి శశిథర్ రెడ్డి కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వారిద్దరూ హైకమాండ్కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి సోదురల విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని ఆయన తప్పుబడ్డారు. ఒక దశలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మర్రి శశిధర్ రెడ్డి
ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు అయిన మర్రి శశిధర్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. హైదరాబాద్‌లోని సనత్ నగర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మంచి పలుకుబడిగా ఉన్న నేతగా యూపీఏ హయాంలో కేంద్ర విపత్తుల నిర్వహణా సంస్థ చైర్మన్‌గా వ్యవహరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన తర్వాత ఆయనకు పెద్దగా పని ఉండటం లేదు. పార్టీ పరమైన పదవులు కూడా పెద్దగా లభించలేదు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోనూ ఆయన పాత్ర తగ్గిపోయింది.
ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కదనే అనుమానం
గత ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయనకు అవకాశం లభించలేదు . పొత్తులో భాగంగా ఆ సీటు తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. అప్పట్లోనే ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఇటీవల తనకు నియోజకవర్గంలో ప్రాబల్యం లేదని.. కొంత మంది వ్యూహకర్తలతో సర్వేలు చేయించి నివేదికలు హైకమాండ్‌కు పంపారని ఆయన అనుమానించారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు గురి పెట్టారు. ఆయన సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనరు. ఇటీవల రాహుల్ గాంధీ పాదయాత్రలోనూ పాల్గొనలేదు. ఈ కారణంగానే మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన ఖండించారు.