Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
ఏసిసి అధ్యక్షుడు మల్లికార్జున గారికి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు గురువారం కాంగ్రెస్ గూటికి చేరారు.
బీఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. మైనంపల్లితో పాటు వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్ పార్టీ కండువా కప్పుకున్నారు. మైనంపల్లి కుమారుడు రోహిత్ కూడా వీరితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో వీరందరికీ ఖర్గే పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎ సి సి తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు కాక్రే తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు పేరు ఉంది. అయితే తనతో పాటు, తన కుమారుడు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాల్సిందేనని మైనంపల్లి పట్టుపడుతుండడమే అసలు సమస్య. అభ్యర్థుల పేర్ల ప్రకటనకు ముందు రోజే తెలంగాణ మంత్రి హరీష్ రావు పై మైనంపల్లి హనుమంతరావు సంచలన విమర్శలు చేశారు.
ఇక ఆ తర్వాత నుంచి మైనంపల్లి వ్యవహారం బీఆర్ఎస్ కు పెద్ద తలనొప్పి గానే మారింది. ఈ క్రమంలో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి మరో అభ్యర్థిని బీఆర్ఎస్ వెతుకుతోంది. ఇది ఇలా ఉంటే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఈ విధంగా బీఆర్ఎస్ పై విమర్శలు చేశారనే ప్రచారం జరిగింది. తన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో మైనంపల్లి ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. మైనంపల్లి హనుమంతరావుకు మల్కాజ్గిరి అసెంబ్లీ, కొడుకుకు మెదక్ టికెట్ ఖరారు అయినట్లు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరారు.
వీడిన ఉత్కంఠ..!
వేముల వీరేశం చేరికకు సంబంధించి చివరి వరకు ఉత్కంఠనే కొనసాగింది. వాస్తవానికి వేముల వీరేశం పార్టీలో చేరతారు.. ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, రేపో మాపో కండువా కప్పేసుకుంటారని ప్రచారం జరిగిన నాటి నుంచి పరిశిలీస్తే.. వీరేశం తప్పం రాష్ట్రంలో పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, భువనగిరికి చెందిన జిట్టా బాలక్రిష్ణారెడ్డి, మహబూబ్ నగర్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేరిక త్వరగానే అయిపోయింది. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఖమ్మం జిల్లా నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు.
రెండు నెలల కిందటే తన డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కారెక్కిన భువనగిరి నాయకుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అక్కడ ఇమడ లేక.. సొంతగూటికి చేరారు.టికెట్ల ప్రకటన రోజు నుంచే బీఆర్ఎస్ నాయకత్వంతో పేచీ పెట్టుకున్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేరిక సీన్ ఢిల్లీకి మారింది. మైనంపల్లికి, ఆయన తనయుడికి ఇద్దరికీ టికెట్లు ఇచ్చే ఖరారుతో పార్టీలో చేరికపై క్లారిటీ వచ్చింది. కానీ, ముందు నుంచీ ప్రచారం జరిగిన వేముల వీరేశం చేరిక మాత్రం పూర్తికాకపోవడం ఆయన వర్గంలో టెన్షన్ పుట్టించింది.