Hyderabad News: మియాపూర్‌లో చిరుత సంచారం - స్థానికుల భయాందోళన
Cheetah Riot: హైదరాబాద్‌లో చిరుత సంచారం భయాందోళన కలిగించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక వైపు చిరుత సంచరిస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Leopard Riot In Miyapur: హైదరాబాద్ (Hyderabad) నగరంలో చిరుత సంచారం కలకలం రేపింది. మియాపూర్ మెట్రో స్టేషన్ (Miyapur Metro Station) వెనుకాల శుక్రవారం రాత్రి ఓ చిరుత సంచరించిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అటవీ అధికారుల సహాయంతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్‌గా మారగా.. అటవీ అధికారులు అక్కడ చిరుత ఆనవాళ్లు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, మియాపూర్ మెట్రో వెనుక భాగంలో ఇప్పటికే తవ్వకాలు జరిగాయి. ఆ తవ్వకాలు జరిగిన స్థలం నుంచే చిరుత వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే, అటవీ శాఖ అధికారులు దీన్ని నిర్ధారించాల్సి ఉంది. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
అటు, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం దూగుట్ట గ్రామ సమీపంలోనూ రెండు రోజులుగా పెద్ద పులి సంచారం అక్కడి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చుట్టుపక్కల చేలల్లో పెద్ద పులి పాదముద్రలు చూసిన గ్రామ ప్రజలు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు హుటాహుటిన సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 15 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు.