(Source: ECI/ABP News/ABP Majha)
UP Lakshman : యోగి సమక్షంలో లక్ష్మణ్ నామినేషన్ - ఎన్నిక ఏకగ్రీవమే ?
యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు లక్ష్మణ్. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
UP Lakshman Nomination : భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. యూపీలో రాజ్యసభ స్థానాల నామినేషన్లకు నేడే ఆఖరు. సోమవారం పొద్దుపోయిన తర్వాత లక్ష్మణ్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. దీంతో ఉదయమే ఆయన లక్నో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. లక్ష్మణ్ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. పార్టీ ముఖ్య నేతలు వెంట రాగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
Today in presence of Shri Yogi ji, our beloved leader Shri Dr.Laxman ji filed nomination as Rajyasabha Member from Uttar Pradesh @drlaxmanbjp @bandisanjay_bjp @kishanreddybjp @AleBhasker_bjp @DrNGouthamRao @BJP4NAMPALLY @BJP4OBCMorcha pic.twitter.com/Tl2Ee7sr9t
— Logishetty.Ripunjai (@Ripunjai4BJP) May 31, 2022
లక్ష్మణ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షునిగా పని చేశారు. ఆయన సమయం ముగిసిన తర్వాత పదవిని బండి సంజయ్‌కు ఇచ్చారు. లక్ష్మణ్‌కు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్ష పదవి ఇచ్చారు. పార్టీ కోసం సిన్సియర్ గా పని చేసే నేత ... తెలంగాణలో ఓ బలమైన సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు పదవి ఇస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ముగ్గురు లోక్‌సభ ఎంపీలు బీజేపీకి తెలంగాణ నుంచి ఉన్నారు. కానీ రాజ్యసభకు ఎన్నికయ్యేంత బలం తెలంగాణలో లేదు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ నుంచి ఒకరికి రాజ్యసభ చాన్స్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకుంది. లక్ష్మణ్, మురళీధర్ రావు, విజయశాంతిలలో ఒకరికి అవకాశం లభిస్తుందని అనుకున్నారు. విజయశాంతి, మురళీధర్ రావులకు సామాజిక సమీకరణాలు కలసి రాలేదు. విజయశాంతి పార్టీలు మారి మళ్లీ బీజేపీలోకి రావడం ఆమెకు మైనస్ అయినట్లుగా తెలుస్తోంది. ఆరెస్సెస్ నుంచి బీజేపీకి వచ్చి కీలక పాత్ర పోషించిన మురళీధర్ రావు రాజ్యసభ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఆయనకు సామాజికవర్గమే మైనస్‌గా మారినట్లుగా తెలుస్తోంది.
బలం లేని రాష్ట్రాల నేతలకు బీజేపీ తమకు బలం ఉన్న రాష్ట్రాల్లో రాజ్యసభకు అవకాశం కల్పిస్తోంది. నిర్మలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపింది. ఇప్పటికే ఏపీకి చెందిన జీవీఎల్ నరసింహారావు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన లక్ష్మణ్ కూడా యూపీ నుంచే రాజ్యసభకు ఎన్నికవుతున్నారు. అంటే యూపీ రాజ్యసభ ఎంపీల్లో ఇద్దరు తెలుగువారు ఉన్నట్లవుతుంది.