Victoria Gowri Sworn In As Judge : మద్రాస్ హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తిగా విక్టోరియా గౌరీ ప్రమాణం - వివాదాన్ని ముగించిన సుప్రీంకోర్టు !
మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా విక్టోరియా గౌరి ప్రమాణం చేశారు. ఆమె నియామకం సరి కాదని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.
Victoria Gowri Sworn In As Judge : మద్రాస్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి నియామకం సరైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.మద్రాసు హైకోర్టు అడిషనల్ జడ్జిగా గౌరి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. సరైన కారణాలు లేకుండా వేసిన పిటిషన్ను అంగీకరించబోమని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్ గవాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్ లో లేవనెత్తిన అంశాలేవీ గౌరి అర్హతలకు సంబంధించినవి కాదని స్పష్టం చేసింది. అర్హతలపై అభ్యంతరాలుంటే సవాల్ చేయొచ్చని తేల్చిచెప్పింది. గౌరిని న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయకుండా ఆదేశాలు జారీ చేయలేమని చెప్పింది.
ఒక వైపు సుప్రీంలో కేసు విచారణ జరగుతుండగానే లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. గతంలో మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం విచారించే కేసుల్లో గౌరి కేంద్రం తరఫున వాదించారు. దీంతో ఆమెకు బీజేపీతో సంబంధాలున్నాయని, క్రిస్ట్రియన్లు, ముస్లింలపై విద్వేష ప్రసంగాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో మద్రాస్ హైకోర్టు అడిషన్ జడ్జి పదవికి ఆమె పేరు సిఫార్సు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ బార్ కౌన్సిల్ మెంబర్స్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఇటీవల దేశంలోని పలు హైకోర్టుల్లో 13 మంది న్యాయమూర్తుల నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులు చేసింది. ఈ సిఫారసులకు కేంద్రం ఆమోదం లభించింది. మద్రాస్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా విక్టోరియా గౌరి నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విక్టోరియా గౌరి గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాదు, ముస్లింలు, క్రైస్తవులపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కారణంగానే విక్టోరియా గౌరి నియామకాన్ని వ్యతిరేకిస్తూ పలువురు న్యాయవాదులు రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు లేఖలు రాశారు.
న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి ఇటీవలి కాలంలో అనేక వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. నియామక ప్రక్రియలో ప్రభుత్వ జోక్యం కూడా ఉండాలని కేంద్రం వాదిస్తోంది. కొలిజీయం సిఫార్సు చేయడం కాకుండా .. అలా చేసే సిఫార్సుల్లోనూ ప్రభుత్వ పాత్ర ఉండాలంటున్నారు. అయితే ఇలా చేస్తున్న సిఫార్సులు కూడా కొన్ని తీవ్రమైన విమర్శలకు కారణం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో న్యాయమూర్తుల నియామకాల విషయంలోనూ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. న్యాయవ్యవస్థ విషయంలో ఇలాంటి పరిణామాలు ఎదురు కావడం నిపుణుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.