KTR Tweet: బీఆర్ఎస్ ఒత్తిడితోనే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ తీర్మానం - ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తొలి విజయమంటూ కేటీఆర్ ట్వీట్
Telangana Assembly: కృష్ణా నదీ జలాల విషయంలో ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడంపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
KTR Tweet on First Victory of BRS in KRMB Issue: బీఆర్ఎస్ ఒత్తిడితోనే కృష్ణా నదీ ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించడం లేదని సోమవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 13న తలపెట్టిన 'ఛలో నల్గొండ ఎఫెక్ట్' కారణంగా అధికార పార్టీలో ఈ చలనం వచ్చిందని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం ఇదేనంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటోను జత చేశారు.
ఛలో నల్గొండ ఎఫెక్ట్!
— KTR (@KTRBRS) February 12, 2024
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్గొండ' సభ సృష్టించిన ఒత్తిడి వల్ల.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేమని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
It’s… pic.twitter.com/0ysa6aUqFC
కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర
మరోవైపు, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బద్నాం చేసేందుకు యత్నిస్తుందంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోని ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటి హక్కులను వదులుకునే మనిషి కాదని ప్రజలందరికీ తెలుసని అన్నారు. జలాల సాధన కోసమే తెలంగాణ ఉద్యమం చేశామని.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని.. కాబట్టి నీటి హక్కుల విషయంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడరని స్పష్టం చేశారు. కృష్ణా నదీ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి జరిగిన సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి సర్కారు పెద్ద తప్పు చేసిందని ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ పై లేనిపోని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల నిర్వహణను అప్పగించే నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హక్కుల విషయంలో బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పటం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. గతంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పచెప్పే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ శాసన సభ, మండలిలో తీర్మానం తీసుకరండి. మీ పాపాలను ప్రక్షాళన చేసుకోండి. తెలంగాణ హక్కుల విషయంలో… pic.twitter.com/30Z3OWL8mo
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 12, 2024