Achampeta Market Committee: మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పై రైతుల దాడి - వేరుశనగకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ఆగ్రహం, ఎక్కడంటే?
Nagarkurnool News: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మార్కెట్ యార్డులో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. మద్దతు ధర కోసం రైతులు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పై దాడికి పాల్పడ్డారు.
Farmers Attacked Market Committee Chairperson In Achampeta: నాగర్ కర్నూల్ జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అచ్చంపేటలోని మార్కెట్ యార్డుకు 709 మంది రైతులు సుమారు 32,875 బస్తాల (బస్తాకు 40 కిలోలు) వేరుశనగ తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు వ్యాపారులు కొనుగోళ్లు ప్రారంభించారు. క్వింటాకు గరిష్ఠంగా రూ.7,060, కనిష్ఠంగా రూ.4,816 ధర ప్రకటించారు. అయితే, నాణ్యత పేరుతో ధర తగ్గిస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు. నిబంధనల ప్రకారం 100 గ్రాముల వేరుశనగలు ఒలిచి.. గింజల బరువును బట్టి ధర నిర్ణయించాలని, కానీ వ్యాపారులు చేతిలోకి కాయలు తీసుకుని ధరలు నిర్ణయిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. మార్కెట్ కమిటీ కార్యాలయానికి చేరుకుని అధికారులు, వ్యాపారులను నిలదీశారు. దీంతో వ్యాపారులు దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో రైతులు తీవ్ర ఆగ్రహంతో మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ అరుణ కార్యాలయానికి వెళ్లారు. గిట్టుబాటు ధర కోసం గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా.. పట్టించుకోవడం లేదంటూ మండిపడుతూ ఆమెపై మహిళా రైతులు దాడికి పాల్పడ్డారు. అనంతరం మార్కెట్ కమిటీ ఆవరణలోని వేరుశనగ కుప్పల వద్దకు లాక్కెళ్లారు. అనంతరం అరుణను అంబేడ్కర్ కూడలికి తీసుకొచ్చి సుమారు 2 గంటల పాటు అక్కడే బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు సద్ది చెప్పేందుకు ప్రయత్నించారు. నిబంధనల మేరకు నాణ్యతను పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని సీఐ రవీందర్ నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.
కేసు నమోదు
మరోవైపు, తనపై రైతులు దాడి చేశారంటూ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ అరుణ ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాము తెలిపారు. అటు, కల్వకుర్తి పట్టణంలోనూ జడ్చర్ల - కోదాడ జాతీయ రహదారిపై వేరుశనగ రైతులు 4 గంటల పాటు బైఠాయించి ఆందోళన చేశారు.
దాడిని ఖండించిన నేతలు
మద్దతు ధర కోసం మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ అరుణపై దాడిని స్థానిక కాంగ్రెస్ నేతలు ఖండించారు. మహిళా నేతపై మహిళా రైతులు దాడి చేయడం సరి కాదని కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాతగుప్తా అన్నారు. ధర కోసం ఆందోళన, ధర్నాలు చెయ్యొచ్చని.. అంతే కానీ ఉన్నత స్థానంలో ఉన్న నేతను లాక్కెళ్లి మరీ దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
Also Read: కృష్ణా ప్రాజెక్టులపై కీలక అప్‌డేట్- బీఆర్‌ఎస్ విజయమే అంటున్న కేటీఆర్