KTR About NEET Exam: పరీక్షా పే చర్చ అంటారు, సమస్య వస్తే స్పందించరా? నీట్ ఎగ్జామ్ పై కేంద్రానికి బహిరంగ లేఖ
KTR Letter On NEET Exam | ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో పరీక్షా పే చర్చ అంటారు, సమస్య వస్తే మాత్రం స్పందించరా? అంటూ నీట్ ఎగ్జామ్ సమస్యపై కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
BRS working President KTRs Open Letter to central govt on NEET Exam| హైదరాబాద్: నీట్ ఎగ్జామ్ 2024 వ్యవహారాన్ని బీఆర్ఎస్ అంత తేలికగా తీసుకోవడం లేదు. కష్టపడి చదివే తమ పిల్లలు కేంద్రం నిర్వహణ లోపంతో నష్టపోతున్నారని, తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బిహార్ లో 30 లక్షల చొప్పున నీట్ ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నారని, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరుగియాని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు.
నీట్ పై మొదట్నుంచీ కేంద్రం నిర్లక్ష్య వైఖరి
నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మొదట్నుంచీ అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని కేటీఆర్ విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ (NEET Exam 2024) పై ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నా ప్రధాని మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని మోదీ.. కీలకమైన నీట్ ఎగ్జామ్ పై మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. నీట్ ఎగ్జామ్ నిర్వహణ, లోపాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. విద్యార్థులకు, లక్షలాదిమంది తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని ఎన్డీయే సర్కార్ కు రాసిన లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు.
అంత మందికి ఫస్ట్ ర్యాంక్ సాధ్యమా?
నీట్ ఎగ్జామ్ లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం అనుమానాలకు తావిస్తోంది. ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి 8 మందికి ఏకంగా 720 మార్కులు రావడం గమనిస్తే.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. ఒక్క మార్కు తేడాతో విద్యార్థుల ర్యాంకులు, జీవితాలు మారిపోతాయి. ఎంతోమంది అవకాశాలు కోల్పోతారు. కానీ ఒకే సెంటర్ లో ఇంతమంది విద్యార్థులకు రికార్డు మార్కులు రావడం ఎలా సాధ్యమని కేటీఆర్ ప్రశ్నించారు. రిజల్ట్స్ ను సైతం 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటంపై అనుమానాలు ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ వ్యవహారం బయటకు రాగానే విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. పైగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఏ సమస్య లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
లక్షలాది విద్యార్థులు ఎన్ని ఫిర్యాదులు చేసినా, పలువురు ప్రముఖులు సుప్రీంకోర్టులో కేసు వేసినా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కేంద్రం ఈ సమస్యను పట్టించుకోకపోవటంపై ఆశ్చర్యం కలిగిస్తోంది. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చిత్రమైన సమాధానాలు చెప్పింది. ఈ ఏడాది 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతున్నారు. నీట్ లాంటి ఎగ్జామ్ లకు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేకున్నా, ఎందుకిలా చేశారో సమాధానం చెప్పాలి. 1563 మంది విద్యార్థులకే ఏ ప్రాతిపదికన గ్రేస్ మార్కులు ఇచ్చారో చెప్పాలి. +4, -1 విధానం ఉండే ఈ ఎగ్జామ్ లో సాధ్యం కాని రీతిలో కొందరికి 718, 719 మార్కులు రావటం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించడం, చేయడం లేదు, మళ్లీ ఎగ్జామ్ రాయిస్తారా క్లారిటీ ఇవ్వడం లేదని మండిపడ్డారు.