KTR London Tour: లండన్, అమెరికా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్, తిరిగొచ్చాకే ఏసీబీ విచారణకు హాజరు
KTR Foreign Tour News | తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఆయన లండన్, అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగొచ్చాకే ఏసీబీ విచారణకు హాజరవుతానని చెప్పారు.

Telangana News | హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్, అమెరికా పర్యటనకు బయలుదేరారు. అమెరికాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలతోపాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. దాంతోపాటు లండన్ లో జరిగే పలు కీలక కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు. లండన్ లో జరిగే ఇండియా వీక్ 2025లో కేటీఆర్ స్పీచ్ ఇవ్వనున్నారని పార్టీ నేతలు తెలిపారు. అయితే ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మే 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కేటీఆర్‌ను ఆదేశింంచింది. ఇదే సమయంలో కేటీఆర్ విదేశీ పర్యటనకు బయలుదేరడం హాట్ టాపిక్ అవుతోంది. పర్యటన నుంచి తిరిగొచ్చాక విచారణకు ఏసీబీ కేటీఆర్ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.
మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు ఆర్.అండ్. డి సేవలను అందించే పీడీఎస్‌ఎల్ (Pragmatic Design Solution Limited ) నాలెడ్జ్ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా కేటీఆర్ వివిధ దేశాల మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులను కలిసి వారితో పలు అంశాలపై చర్చించనున్నారు.
యూకేలో కేటీఆర్ కార్యక్రమాలు
ముందుగా యూకేలో పర్యటించే కేటీఆర్, బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో లండన్ లో జరిగే ఇండియా వీక్ 2025లో ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు పాల్గొనే ఈ సమావేశంలో 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కేంద్రంగా సాగిన పాలన, ఆలోచనలు అద్భుత ఆవిష్కరణలుగా మారిన విధానంతో పాటు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కేటీఆర్ వివరిస్తారు.
మొబిలిటీ టెక్నాలజీలో తెలంగాణ ఆధారిత ఆవిష్కరణలకు సాక్ష్యంగా నిలిచిన పీడీఎస్‌ఎల్ (Pragmatic Design Solution Limited ) నాలెడ్జ్ సెంటర్ ను అదే రోజు వార్విక్‌లో కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో అత్యాధునిక నీర్ షోర్ హార్డ్‌వేర్-ఇన్-లూప్ (హెచ్‌ఐఎల్) టెస్ట్ సెంటర్ ఉంది. మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీల కోసం అధునాతన ఆర్ అండ్ డీ సేవలను PDSL అందిస్తుంది.
అమెరికాలో కేటీఆర్ కార్యక్రమాలు
అమెరికాలో తెలంగాణ ఎన్.ఆర్.ఐ లు నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారు. జూన్ 1న టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వేలాది ఎన్నారైలు పాల్గొంటారు.
యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ (యూటీ డల్లాస్)లోని భారతీయ విద్యార్థులను జూన్ 2 న కేటీఆర్ కలుస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్పూర్తిగా నిలిచిన కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్ తో పాటు భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి కేటీఆర్ మాట్లాడనున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూకే, యూఎస్ పర్యటనపై అక్కడి ఎన్.ఆర్.ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు దేశాల్లోని ప్రవాస తెలంగాణ వాసులతో పాటు ప్రవాస భారతీయులు, విద్యార్థులను తన పర్యటనలో కేటీఆర్ కలవబోతున్నారు.






















