KTR On MODI : పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !
ఉచిత పథకాలపై జరుగుతున్న చర్చలో ప్రధాని మోదీపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఉచిత పథకాలంటే ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
KTR On MODI : దేశ సంపద పెంచే తెలివి లేదు - ప్రజలకు మేలు చేసే మనసు లేదని ప్రధానమంత్రి మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇటీవలి కాలంలో ఉచిత పథకాలు దేశానికి నష్టదాయకంగా మారాయని ప్రధాని విమర్శిస్తున్నారు. ఈ అంశంపై కేటీఆర్ స్పందించారు. ఎనిమిదేళ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సామాన్యుడి బతుకును భారం చేసి..ఇప్పుడు ఉచిత పథకాలపై చర్చ పెట్టారని విమర్శించారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో నైజీరియా కన్నా ఎక్కువమంది పేదలున్న దేశంగా మారిందన్నారు. మోడికి ముందున్న 14 మంది ప్రధానులు కలిసి రు. 56 లక్షల కోట్ల అప్పుచేస్తే, మోడి ఒక్కరే సుమారు 80 లక్షల కోట్లకు పైగా అప్పుచేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే దేశ వార్షిక రాబడిలో 37% ఖర్చు అవుతున్నదని మొన్ననే కాగ్ తీవ్ర హెచ్చరిక చేసిందని గుర్తు చేశారు. పరిస్థితి ఇలాగే పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని కాగ్ హెచ్చరించిందని కేటీఆర్ గుర్తు చే్శారు.
అప్పులు తెచ్చిన లక్షల కోట్లు ఏం చేశారు ?
ఇంత భారీ ఎత్తున అప్పుగా తెచ్చిన మోడి ఆ డబ్బును ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చుచేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెచ్చిన ఆ అప్పుతో ఒక్క భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టలేదన్నారు. ఇవేవీ చేయనప్పుడు మరి ఇన్ని లక్షల కోట్లు ఎవరి బొక్కసాలకు చేరిందో ఆయనే చెప్పాలన్నారు. మన రాజ్యంగంలో రాసుకున్న ప్రకారం భారత దేశం ఒక "సంక్షేమ రాజ్యం" అని కేటీఆర్ తెలిపారు. ఆదేశిక సూత్రాల ప్రకారం భారత ప్రభుత్వం తన పౌరులందరికీ స్త్రీ పురుష వివక్ష లేకుండా సమానంగా జీవనోపాధి కల్పించాల్సి ఉందన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో మనదేశం ఈ ఆదేశికసూత్రాల అమలులో ఎంతో వెనుకబడి ఉన్నదనేది చేదు నిజమన్నారు.
ఉచిత పథకాలంటే ఏమిటి ?
ఇంతకూ ప్రధాని మోడీ ఉచితాలు అంటూ వెక్కిరిస్తున్నది ఏ పథకాలనని కేటీఆర్ ప్రశ్నించారు. దశాబ్దాలుగా ప్రకృతి ప్రకోపానికి గురై, గిట్టుబాటు ధరలేక, అప్పులపాలై ఉసురుదీసుకుంటున్న రైత్ననకు ఇస్తున్న ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలనేనా మోడి గారు ఇవ్వొద్దు అంటున్నది అని ప్రశ్నించారు. అయినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి రైతులను 13 నెలల పాటు రోడ్ల మీదకు తెచ్చి, అరిగోస పెట్టి 700 పైచిలుకు రైతుల బలవన్మరణానికి కారణమైన మీకు రైతు సంక్షేమం అనే మాటకు కూడా అర్థం తెలియదన్నారు. ఈ దేశంలో అత్యంత పేదలుగా ఉన్న బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన బడుగులకు ఒక్క రూపాయికే కిలో బియ్యం ఇవ్వడం తప్పా అని మండిపడ్డారు.
పేదల కడుపు నింపే పథకాలు ఉచిత పథకాలా.. వాటిని ఆపేయ్యాలా?
బడుగు, బలహీన వర్గాల పిల్లలకు స్కూళ్లలో ఉచితంగా భోజనం పెట్టడం, గురుకుల స్కూళ్లు పెట్టి పేద బిడ్డలకు ఉచిత వసతులిచ్చి వారిని మెరికల్లాగా తీర్చిదిద్దడం , మన భావితరం పోషకాహార లోపంతో కునారిల్లకుండా ఉండటానికి గర్భిణి స్త్రీలకు ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను అమలు చేయడం వంటివి మీ దృష్టిలో వృధా ఖర్చా అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదింటి బిడ్డకు పెళ్లిచేయడం ఆ తల్లితండ్రులకు భారం కావద్దు అని కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ వంటి పథకాలు... దళితబంధు పథకం అవసరం లేదంటున్నారా అని మండిపడ్డారు.
పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ?
కాకులను కొట్టి గద్దలకు వేసే విధానం అమలు చేస్తున్నారన.ి. సామాన్యుడి కడుపుగొట్టి, కార్పొరేట్లకు లబ్ది చేకూరుస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రజా సంక్షేమం మీద మీ విధానం ఏమిటో ఈ దేశ ప్రజలకు స్పష్టం చేయండి. దాని మీద చర్చ పెట్టండ అని పిలుపునిచ్చారు. మీ ఎనిమిదేళ్ళ పాలనలో బడా బాబులకు మాఫీ చేసిన/ఎగ్గొట్టిన రుణాలు ఎన్ని? రైతన్నకు మాఫీ చేసిన రుణాలు ఎన్ని? చెప్పాలన్నారు. మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలు రద్దు చేస్తారేమో చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ఉచిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళతారా అని సవాల్ చేశారు.