KTR : గ్రేటర్ కార్పొరేటర్లకు అండగా బీఆర్ఎస్ - ప్రభుత్వంపై పోరాడదాం - కేటీఆర్ భరోసా
Greater Hyderabad corporators : గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని. ఆ పార్టీ వేధింపుల్ని ధైర్యంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.
![KTR : గ్రేటర్ కార్పొరేటర్లకు అండగా బీఆర్ఎస్ - ప్రభుత్వంపై పోరాడదాం - కేటీఆర్ భరోసా KTR had a meeting with Greater Hyderabad corporators KTR had a meeting with Greater Hyderabad corporators KTR : గ్రేటర్ కార్పొరేటర్లకు అండగా బీఆర్ఎస్ - ప్రభుత్వంపై పోరాడదాం - కేటీఆర్ భరోసా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/10/c8ded81088123a250a683fdca3b25a4f1707566956733228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
KTR had a meeting with Greater Hyderabad corporators : రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో తెలంగాణ భవన్‌లో సమావేశం అయ్యారు. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన, 420 హామీలకు అమలుకు 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించిందని.. మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా సోదరీమణులకు ఇవ్వాల్సిన మొత్తమే 50వేల కోట్ల పైన అవుతుందన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరాలని బెదిరింపులు వస్తున్నాయన్న ప్రచారం జరుగుతున్న సమయంలో వారికి ధైర్యం ఇవ్వడానికి కేటీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
రూ. 57 వేల కోట్లతో హామీలన్నీ అమలు చేయగలరా ?
రైతుబంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో బడ్జెట్లో చెప్పలేదని కేటీఆర్ విమర్శించారు. ఫార్మాసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వలన రాష్ట్ర అభివృద్ధి కూడా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అభివృద్ధి దెబ్బతింటే, రాష్ట్రానికి రాబడి, రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉన్నదని.. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపైన దృష్టి పెట్టకుండా, కేవలం ప్రజలను తప్పు దోవ పట్టించే అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలను ప్రజలు ఎక్కువ రోజులు నమ్మరని స్పష్టం చేశారు.
కార్పొరేటర్ల వల్లే గ్రేటర్‌లో బీఆర్ఎస్ విజయం
ఎమ్మెల్యే టికెట్లు ఆశించి.. రాజకీయ కారణాలతో అవకాశం రాకున్నా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారని కార్పొరేటర్లను కేటీఆర్ ప్రశంసించారు. ప్రతి ఒక్క కార్పొరేటర్, పార్టీ శ్రేణులు చేసిన కృషి వల్లనే ఈరోజు హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగలిగిందన్నారు. గత పది సంవత్సరాలలో ప్రతిరోజు పార్టీ కార్పొరేటర్లు ప్రజల్లో నిలబడి మరీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా చూశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. జీహెచ్ఎంసీ పాలకవర్గం బాధ్యతలను నిర్వహించడంలో ఇబ్బందులకు గురిచేస్తుందని.. ప్రజా పాలన అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం జరగకుండా, స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు కాకుండా ఆపుతుందని విమర్శించారు. రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఐదు అంచెల పరిపాలన వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన స్థానిక ప్రభుత్వం జీహెచ్ఎంసీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని.. జీహెచ్ఎంసీ పాలకమండలి మరియు ప్రజల చేత ఎన్నికైన కార్పొరేటర్లు తమకున్న అధికారులను ఉపయోగించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కార్పొరేటర్లకు అండగా బీఆర్ఎస్
అధికారంలో ఉన్న, లేకున్నా తమ తమ డివిజన్లో ప్రజలతో కలిసి పని చేద్దామని మాజీ మంత్రి తలసాని పిలుపునిచ్చారు. పది సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా నగరాన్ని అభివృద్ధి చేసిందన్నారు. అన్ని రంగాల్లో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించిందని.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజల అసంతృప్తి నెలకొందన్నారు. పార్టీ కార్పొరేటర్ల వెంట, జీహెచ్ఎంసీ పార్టీ శ్రేణుల వెంట మొత్తం పార్టీ నిలబడుతుంది అధికారులు, ప్రభుత్వం ఒత్తిడికిలోనై గతంలో ఇచ్చిన నిధులను, పనులు చేయడం లేదు. ఈ కక్షపూరిత విధానంపైన ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మన ప్రజలకు డివిజన్లో అవసరమైన కార్యక్రమాలు అమలు అయ్యేలా చేద్దామని సలహా ఇచ్చారు.
అధికారులు సహకరించడం లేదన్న మేయర్ !
జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశాన్ని హైదరాబాద్ ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అజెండా కోసం నిర్వహిస్తామని.. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించడం లేదని మేయర్ విజయలక్ష్మి ఆరోపించారు. అధికారుల ఒత్తిడిని, వారి పరిమితులను అర్థం చేసుకోగలుగుతాం కానీ.. ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి నగర అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరారు. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు, జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించే అంశాన్ని నిర్ణయించడం కోసమే ముఖ్యమంత్రిని కలిశాననని.. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పానన్నారు. ఒక సాధారణ కార్పొరేటర్ గా ఉన్న నన్ను, మేయర్ గా అవకాశం ఇచ్చి గొప్ప గౌరవమిచ్చిన పార్టీకి జీవితాంతం నిబద్ధతతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)