KTR : బీఆర్ఎస్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడదు - కేటీఆర్ జోస్యం !
బీఆర్ఎస్ ప్రమేయం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పోచంపల్లిలో చేనేత కార్యక్రమంలో మాట్లాడారు.
KTR : తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మరోసారి అధికారంలోకి వస్తుందని అందులో సందేహమే లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ మూడోసారి ముచ్చటగా మీ అందరి ఆశీర్వాదంతో సీఎం అవుతారన్నారు. కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడతది.. మన బలం లేకుండా ఎవరూ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి అక్కడ ఉండదన్నారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
చేనేతపై జీఎస్టీ విధించిన మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో కూడా మనం ఉండాలి. కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నారు. మన బలం లేకుండా ఎవరూ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి అక్కడ ఉండదు. కేంద్రంతోని కొట్లాడే వాళ్లు కావాలి. కేంద్రం మెడలు వంచే నాయకుడు కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ లాంటి నాయకుడు ఇక్కడ ఎవర్ని నిలబెట్టినా గెలిపించాలని కోరారు. పార్లమెంట్‌లో మన మాట నెగ్గించుకోవాలి. నెగ్గించుకోకపోతే మన నేతన్నల బతుకులు బాగు పడవు. మోదీ ఉన్నంతకాలం.. ఆయన ఆడిచ్చే డూడూ బసవన్నలు ఉన్నంతకాలం, ఢిల్లీకి బానిసలు ఉన్నంత కాలం పరిస్థితులు మారవన్నారు.
తప్పకుండా మన పాత్ర ఢిల్లీలో ఉండాలి. కేసీఆర్ లాంటి దమ్మున్న దక్షత కలిగిన నాయకుడు రేపు కేంద్రంలో పాత్ర పోషించే పరిస్థితి రావాలి. రావాలంటే మీ ఆశీర్వాదం ఉండాలి. పద్మశాలి సోదరుల కోసం కోకాపేటలో రెండున్నర ఎకరాల స్థలంలో భవనం కట్టిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆలిండియా పవర్ లూమ్ బోర్డు, ఆలిండియా హ్యాండిక్రాఫ్ట్ బోర్డు రద్దు చేసిందని కేటీఆర్ విమర్శించారు. హౌసింగ్ కమ్ వర్క్ షెడ్డు కార్యక్రమాన్ని కూడా రద్దు చేసింది. పనికొచ్చే పథకాన్ని ఉంచకుండా రద్దు చేసింది మోదీ ప్రభుత్వం. 75 ఏండ్లలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయని తప్పు ఈ ప్రధాని చేస్తున్నారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గమైన ప్రధాని మోదీ. మునుగోడు ఎన్నికల సందర్భంగా వేల సంఖ్యలో ఉత్తరాలు రాశాం. జీఎస్టీ ఎత్తేయాలని కోరాం. కేసీఆర్ కూడా చండూరు వేదికగా మోదీకి అభ్యర్థించారని కేటీఆర్ గుర్తు చేశారు.
హ్యాండ్లూమ్, పవర్ లూమ్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం అని కేటీఆర్ తెలిపారు. టెస్కోను బలోపేతం చేస్తున్నాం. సొసైటీకి ఎన్నికలు కావాలంటే వెంటనే పెడుతాం. మాకేం అభ్యంతరం లేదు. కార్మికులు బాగుపడాలనేది మా ఆలోచన. మనసున్న నాయకుడు మంచి సీఎం ఉంటే అన్ని పనులు అవుతాయి. రైతు రుణమాఫీ అవుతదా అనుకున్నారు. కేసీఆర్ కరోనా వల్ల నష్టపోయిండు.. రుణమాఫీ చేయడని కాంగ్రెసోళ్లు అనుకున్నారు. కేసీఆర్ మాటిచ్చిండు అంటే.. తప్పడు కాబట్టే.. 19 వేల కోట్లతో రెండోసారి రైతు రుణమాఫీ చేస్తున్నారు. చేనేత రుణమాఫీ కూడా ఇది వరకు చేశాం. మళ్లీ చేనేత రుణాల మాఫీ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ తెలిపారు.