KTR Letter : తెలంగాణ చేనేతకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి - కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి !
తెలంగాణ చేనేత రంగానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు.
KTR Letter : తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర టెక్స్ టైల్ రంగానికి తగినన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర టెక్స్ టైల్ శాఖ మంత్రి కే.తారక రామారావు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక వినూత్న కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టిందని, కానీ ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అందిన ప్రోత్సాహమేదీ లేదని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదేనని కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే ఈ బడ్జెట్లోనే భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
వరంగల్ టెక్స్ టైల్ పార్క్‌కు ఆర్థిక సాయం !
దేశంలోనే అతిపెద్ద టెక్స్ టైల్ పార్కును కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ పేరుతో తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ మెగా టెక్స్ టైల్ పార్కులో జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్ధలు సైతం పెట్టుబడి పెడుతున్నాయని, దేశీయ టెక్స్ టైల్ రంగంలో ఈ పార్కుకున్న ప్రాధాన్యతను గుర్తించాలని కెటిఆర్ కేంద్రాన్ని కోరారు. సుమారు 1600 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ భారీ టెక్స్ టైల్ పార్క్ కు మౌళిక వసతులు కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కనీసం 900 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. టెక్స్ టైల్ రంగంలో ఇండియా కన్నా బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాలు ముందున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలతో పోటీపడే విధంగా భారీ మౌలిక వసతుల కల్పన చేపట్టి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కేంద్రం కనీస సాయం కూడా చేయడం లేదని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
సిరిసిల్ల పవర్ లూమ్ క్లస్టర్‌కు నిధులు !
కాంప్రహెన్సివ్ పవర్ లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీంలో భాగంగా సిరిసిల్లలో భారీ పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని ఈ మేరకు కేంద్రం నిధులు అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్ లో 25 వేలకు పైగా పవర్లూమ్ మగ్గాలు ఉన్నాయని, ఈ బడ్జెట్లో దీన్ని ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ గా గుర్తించి, ఈ ప్రాజెక్టు కోసం కనీసం 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులను అందించాలని కేటీఆర్ కోరారు. సిరిసిల్ల మరమగ్గాల ఆధునికీకరణ, వాల్యూ చైన్ బలోపేతం, మార్కెట్ అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్, ప్రాజెక్ట్ మానిటరింగ్ వంటి ఖర్చుల కోసం సుమారు రూ. 990 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఇందులో సింహభాగాన్ని ఈ బడ్జెట్ లో కేటాయించాలని కోరారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని తెలంగాణకు మంజూరు చేయాలి !
తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేత కళ పైన డిప్లమా చేసేందుకు ఇక్కడి విద్యార్థులకు అవకాశం లేదని వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్లి శిక్షణ పొందుతున్న నేపథ్యంలో తెలంగాణకి ఈ విద్యా సంస్థ మంజూరు చేస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉండడంతో పాటు ఇక్కడి చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడుతుందని కేటీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి గుండ్ల పోచంపల్లి మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలో అవసరమైన స్థలం అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు నేషనల్ టెక్స్ టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హ్యండ్ లూమ్ ఎక్స్పొర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్ ఎర్పాటును ఈ బడ్జెట్ లో ప్రకటించాలని కోరారు.
యార్న్ సబ్సిడీని 50 శాతానికి పెంచాలి..!
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే యార్న్ సబ్సిడీని కనీసం 50 శాతానికి పెంచడంతో పాటు మార్కెటింగ్ ఆధారిత ఇన్సెంటీవ్ పథకాన్ని సరళతరం చేసి నేతన్నలకు అండగా ఉండేలా ఈ బడ్జెట్ లో నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా గా నిలిచే బీమా యోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలన్నారు.నేత కార్మికుల సంక్షేమం, టెక్స్ టైల్ రంగ భవిష్యత్తును నిర్దేశించే ఇలాంటి సానుకూల నిర్ణయాలను తీసుకొని మోడీ ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకునే చివరి అవకాశం ఈ బడ్డెజ్ అని కేటీఆర్ చెప్పారు. భారీగా నిధులు కేటాయించి ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేతన్నలకు అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. MSME పై ఉన్న పన్నుల భారం వలన వాటి మనుగడ చాలా కష్టంగా మారిందని, ఈ విషయంలో కేంద్రం ఈ బడ్జెట్ లో ఉదారంగా వ్యవహరించాలని, పరిశ్రమ ప్రొత్సహాక చర్యలు ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 20 లక్షల జీఎస్టీ స్లాబ్ ను చేనేత మరియు పవర్లూమ్ కార్మికులకు 50 లక్షల వరకు పెంచాలన్నారు.