Revanth Reddy : మంత్రి పువ్వాడ ఓ సైకో, కమ్మ కులం నుంచి బహిష్కరించాలి : రేవంత్ రెడ్డి
Revanth Reddy Khammam Tour : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు.
Revanth Reddy Khammam Tour : మంత్రి పువ్వాడ ఓ సైకో.. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే మాడి మసైపోతారని రేవంత్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. వరంగల్‌లో జరిగే రాహుల్ గాంధీ సభ విజయవంతం కోసం ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతాంగ పోరాటాలను ఖమ్మం జిల్లా నుంచే చేపట్టిందన్నారు. కార్యకర్తలను సంసిద్ధం చేసి రాహుల్ గాంధీ సభకు తరలి వచ్చేలా చేయాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో పువ్వాడకు బుద్ధి చెప్పాలి
ఖమ్మం జిల్లా అంటే శీలం సిద్ధారెడ్డి, మల్లు అనంతరాములు, వెంగళరావు, నల్లమల గిరిప్రసాద్ వంటి నాయకులు గుర్తుకు వస్తారన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. వీరంతా ప్రజాసమస్యలపై పోరాటాలు చేసి అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భట్టి, రేణుకాచౌదరి, సంభాని చంద్రశేఖర్ ప్రజా సమస్యలపై స్పందించారని చెప్పారు. అటువంటి జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ భర్త ముస్తఫాపై, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పీడీయాక్ట్ పెట్టించి రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ ఇందుకు కారణమన్నారు. అలాంటి సైకోలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో అటువంటి వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే మాడి మసైపోతారని అన్నారు.
రాహుల్ సభ సక్సెస్ చేయాలి
రైతులకు అండగా ఉండేందుకు వచ్చేనెల 6న హన్మకొండలో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభకు లక్షలాదిగా రైతులు, ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. చనిపోతున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని, రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏఐసీసీ నాయకులు రాహుల్‌గాంధీ ఈ సభకు ముఖ్యఅతిథిగా వస్తున్నారని, కనీవిని ఎరుగని రీతిలో ఈ సభను విజయవంతం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి రైతులకు అండగా నిలబడాలని వరంగల్ కేంద్రంగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వానాకాలంలో రైతులు వరి వేయొద్దని, వరి పంట వేస్తే రైతుబంధు రద్దు చేస్తామని, ధాన్యం తాము కొనుగోలు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారన్నారు.
కులం అడ్డుపెట్టుకుని రాజకీయాలు
మంత్రి పువ్వాడ చేసిన దుర్మార్గాలకు ఓ పిల్లవాడు బలైతే ఆయన ఓ సమావేశంలో కమ్మ కులాన్ని అడ్డుపెట్టుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కమ్మలకు ప్రధాన వృత్తి వ్యవసాయం, ఎవరొచ్చినా ఆదరించే కులం కమ్మకులం అన్నారు. అలాంటి కులంలో పుట్టి హింసకు పాల్పడి ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను నిర్మూలించే వ్యక్తి తాను కమ్మ కులం అని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. కమ్మ కులం నుంచి పువ్వాడ అజయ్‌ను బహిష్కరించాలని కోరారు. ఆయన చేసిన దుర్మార్గాలు, దోపిడీలపై, అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలని అన్నారు.