Jupally Ponguleti Joins Congress : కాంగ్రెస్ గూటికే జూపల్లి, పొంగులేటి- ఈ నెల 30న ముహూర్తం ఫిక్స్!
Jupally Ponguleti Joins Congress : బీఆర్ఎస్ సస్పెండ్ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ఈ ఇద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
Jupally Ponguleti Joins Congress :మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నెల 30న ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సరూర్ నగర్ లో నిర్వహించే నిరుద్యోగ నిరసన దీక్షకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరితో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇద్దరు అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎన్నికల సమయంలో మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. వీరి బాటలోనే మరింత మంది నేతలు కాంగ్రెస్ లో చేరవచ్చని తెలుస్తోంది.
రాహుల్ గాంధీ టీమ్ తో చర్చలు!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమ్ తో జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చించినట్లు తెలుస్తోంది. సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క, పోదెం వీరయ్య నియోజకవర్గాలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనుచరులకు సీట్లు ఇచ్చేందుకు రాహుల్ గాంధీ టీమ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి జూపల్లి ఉమ్మడి మహబూబ్ నగర్ లో కీలక టికెట్లు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కొవాలంటే సీనియర్ నేతలు అవసరమని భావిస్తున్న కాంగ్రెస్.. ఆ దిశగా అడుగులు వేస్తుంది. బీఆర్ఎస్, బీజేపీలపై అసంతృప్తితో ఉన్న నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఆ ఆపరేషన్ లో భాగంగానే జూపల్లి, పొంగులేటిని హస్తం పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అన్నీ సెట్ అయితే ఈ నెల 30న ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.
ఖమ్మంపై పట్టుకోసం పొంగులేటి వ్యూహాలు
ఖమ్మం జిల్లాలో బీజేపీకి బలం లేదు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్లడం కన్నా కాంగ్రెస్ లో చేరితేనే బెటరని పొంగులేటికి శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు. ఖమ్మం జిల్లా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోన్న పొంగులేటి ఖమ్మంలో సత్తా చాటగలిగితే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ చక్రం తిప్పవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఇంకో అనుకూల అంశం ఏంటంటే ఖమ్మంలో పొంగులేటి రాకను వ్యతిరేకించే కాంగ్రెస్ నేతలు కూడా ఎవరూ లేరు. అది అసలు సిసలు అడ్వాంటేజ్. ఒక వేళ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోతే పొంగులేటి ద్వారానే మరో బి.ఆర్.ఎస్. బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావును కూడా కాంగ్రెస్ లో చేర్పించాలన్నది హస్తం నేతల వ్యూహంగా చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి జూపల్లికి ఒత్తిడి వస్తోంది. కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యం కాంగ్రెస్ లో చేరితేనే నెరవేరుతుందని, ఈ టైంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హస్తం నేతలు సూచిస్తున్నారు. దిల్లీ నుంచి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు జూపల్లితోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు హస్తం పార్టీలో చేరడం దాదాపు ఖరారు కావడంతో కాంగ్రెస్ నేతల వ్యూహాలు ఫలించాయని చెప్పవచ్చు.