(Source: ECI/ABP News/ABP Majha)
Keshava Rao: కాంగ్రెస్ నా సొంతిల్లు, నేను కాంగ్రెస్ మనిషిని -సీఎం రేవంత్‌ను కలిసిన కేశవరావు
KK Resign : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Keshava Rao: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. బుధవారం కాంగ్రెస్ లో చేరిన ఆయన నేడు ( గురువారం, జూలై 4, 2024 ) తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఆయన ఢిల్లీలోని కేకే నివాసానికి ఆయన చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేశవరావు స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు. తిరిగి సొంతగూటికి చేరిన కేకేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నా సొంత ఇల్లు.. నేను కాంగ్రెస్ మనిషిని. ఇప్పుడు స్వేచ్చ ఫీలింగ్ ఉంది.. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా ఉందన్నారు. ఆరు నెలల్లో ఎవరిని అంచనా వేయలేమన్నారు. ఆరు నెలల్లో చేపట్టిన ప్రతి కార్యక్రమం అభివృద్ధితో కూడుకున్నదే చేస్తున్నారని.. ఫ్యామిలీ పబ్లిసిటీ గత ప్రభుత్వంలో ఉన్న వారు చేశారని మండిపడ్డారు. తాను నైతిక విలువలతో రాజీనామా చేశానన్నారు. రాజ్యసభ ఛైర్మన్ కు కూడా అదే చెప్పానని ఆయన తెలిపారు
ఇకపై ఆయన సలహాలు పాటిస్తాం
తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేశవరావు రాజీనామా విషయం పార్టీ అంతా కలిసి నిర్ణయం తీసుకున్న అంశమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి ఏది మంచో ఆయన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కేశవరావు సలహా మేరకే ఇకపై రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని రేవంత్ స్పష్టం చేశారు. అలాగే నేడు రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ను కలిసి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖను సమర్పించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే.. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నిక అయిన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగలేనని తెలిపారు. నైతికతకు కట్టుబడి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల వివాదం నేపథ్యంలో జాతీయ స్థాయిలో అలాంటి పరిస్థితులకు తావు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని రాహుల్ స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కేశవరావు తన పదవికి రాజీనామా చేశారు.
ప్రభుత్వ సలహాదారుడిగా కేకే ?
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేశవరావుకి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా క్యాబినెట్ హోదా ఇవ్వాలని అనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకపై రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి ఏది మంచో కేకే నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా రేవంత్ చెప్పారు. ఆయన సలహా మేరకే రాష్ట్రప్రభుత్వం నడుస్తుందన్నారు. తెలంగాణలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లు పక్కా ఉంటుందని, రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మూసీ అభివృద్ధి, రీజనల్ రింగు రోడ్డుపై దృష్టి పెట్టామని, 11వేలకు పైగా టీచర్ల బదిలీలు చేశామన్నారు. అనంతరం కేకే నివాసం నుంచి తెలంగాణకు తిరిగి వచ్చేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు సీఎం రేవంత్ బయలుదేరారు.