Breaking News Live: మరోసారి ఛార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనానికి కొద్ది గంటలే మిగిలి ఉంది. సోమవారం (మార్చి 28) ఉదయం 11.55 గంటలకు మంచి ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. ఈ మహా క్రతువుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలవుతాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో శోభాయాత్ర నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేపడతారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు సంప్రోక్షణ చేస్తారు. దివ్య విమానంపై శ్రీసుదర్శన స్వర్ణ చక్రానికి, ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులు సంప్రోక్షణ నిర్వహిస్తారు.
ఈ క్రతువులో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రధానాలయంలోకి శోభాయాత్రగా వెళ్లి పంచనారసింహుడికి ఆరాధనలు జరుపుతారు. అనంతరం స్వయంభువుల దర్శనాలకు అనుమతి ఇస్తారు. బాలాలయంలో 2016 ఏప్రిల్ 21 నుంచి ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచే బాలాలయంలో దర్శనాలకు తెరపడింది.
యాదాద్రి ఆలయంలో నేటి కార్యక్రమాలు ఇవీ..
* ఉదయం 7.30 గంటల నుంచి నిత్య హోమాలు, చతుస్థానార్చన, పరివార శాంతి ప్రాయశ్చిత్త హోమం, శాలబలి కార్యక్రమాలు ఉంటాయి.
* ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, మిథున లగ్న పుష్కరాంశమున గర్తవ్యాసము, రత్నవ్యాసము, యంత్ర ప్రతిష్ఠ, బింబ ప్రతిష్ఠ, అష్టబంధనం, కళారోహణం, ప్రాణ ప్రతిష్ఠ, నేతోన్మీలనం, దిష్టికుంభం ఉంటుంది.
* ఉదయం 10 గంటలకు బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర కార్యక్రమం ఉంటుంది.
* మధ్యాహ్నం 11.55 గంటలకు మిథునలగ్న సుముహూర్తాన మహా కుంభాభిషేకం, ప్రథమ ఆరాధన, ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు
* సాయంత్రం 6 గంటలకు శాంతి కల్యాణం, ఆచార్య రుత్విక్ సన్మానం, మహాదాశీర్వచనం ఉంటుంది.
ఆదివారం పంచశయ్యాధివాసం
పాంచరాత్ర ఆగమ విధానాలతో ఆదివారం నాడు మహాయాగ క్రతువు, ప్రధానాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం, షోడశ కళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం జరిగాయి. శాస్ర్తోక్తంగా 108 కలశాలతో అష్టోత్తర శత కలశాభిషేకం చేశారు. కలశాల్లో పవిత్ర జలాలు, పంచామృతం, సుగంధ ద్రవ్యాలను నింపి సుదర్శన చక్రం, పెరుమాళ్లు, గోదాదేవి, గరుడ, విష్వక్సేన, ప్రతిష్ఠామూర్తులను అభిషేకించారు. ప్రధానాలయంలో షోడశకళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం పర్వాలను నిర్వహించినట్టు ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థిఘల్ లక్ష్మీనర్సింహాచార్యులు తెలిపారు. బాలాలయంలో వేద మంత్రాలు, సామూహిక విష్ణు సహస్రనామ పఠనం తదితర కార్యక్రమాలు కొనసాగాయి.
మరోసారి ఛార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ మరోసారి ఛార్జీలు పెంచింది. ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సులలో రూ. 5 పెంచింది. గరుడ, లగ్జరీ బస్సుల్లో రూ.10 ఛార్జీలు పెంచింది. పాసింజర్ సెస్ పేరిట ఛార్జీలు పెంచినట్లు తెలుస్తోంది. ఆర్డినరీ బస్సుల్లో రూ.1 సెస్ వసూలు చేస్తున్నారు.
Yadadri Temple: సతీసమేతంగా యాదాద్రిలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి గంగుల
Minister Gangula Kamalakar Yadadri Temple: బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. సతీసమేతంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు సమర్పించుకున్నారు. యాదాద్రి ఆలయంలో మహా సంప్రోక్షణ ఘనంగా జరిగింది.
Yadadri Maha Samprokshana: గర్భాలయంలోకి ఉత్సవ మూర్తులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. కొద్దిసేపటి క్రితమే మహాకుంభ సంప్రోక్షణ ఘట్టం పూర్తయింది. ఆ తర్వాత ఉత్సవ మూర్తులను యాదాద్రి గర్భాలయంలోకి తీసుకువెళ్లారు. స్వయంభువు లక్ష్మీనరసింహ స్వామికి మొదటి పూజ, మహానివేదన, మొదటి తీర్థ ప్రసాదగోష్ఠిని వేద పండితులు సమర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు మహా వేద ఆశీర్వచనం ఇచ్చారు.
బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ, బీజేపీ సభ్యుల కోట్లాట.. అయిదుగురు సస్పెండ్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో వివాదం జరిగింది. టీఎంసీ, బీజేపీ సభ్యులు వాగ్వివాదానికి దిగగా, ఆపై తోపులాట జరిగి భౌతికదాడులకు దారితీసింది. ఐదుగురు బీజేపీ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.
Guntur SP Office: గుంటూరు జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమంలో మహిళ ఆత్మహత్యాయత్నం
Woman Suicide Attempt At Guntur SP spandana program: గుంటూరు ఎస్పీ కార్యాలయం దగ్గర కలకలం రేగింది. గ్రీవెన్స్‌కు పురుగుల మందు డబ్బాతో వచ్చిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ స్పందన కార్యక్రమంలో మహిళ ఆత్మహత్యాయత్నం చేయగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని జీజీహెచ్‌కు తరలించారు. అయితే పురుగులమందు వాసనకు ఓ కానిస్టేబుల్ స్పృహతప్పి పడిపోయినట్లు తెలుస్తోంది.