KCR Return : కార్యవర్గంపై హైదరాబాద్‌లోనే కసరత్తు - తిరిగొచ్చేసిన కేసీఆర్ !
బీఆర్ఎస్ కార్యవర్గంపై కసరత్తును కేసీఆర్ హైదరాబాద్‌లోనే చేయనున్నారు. మూడు రోజుల తర్వాత ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు.
KCR Return : తెలంగాణ సీఎం సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ 5 ఎస్పీ మార్గ్ లో మొన్న ప్రారంభమైన పార్టీ జాతీయ కార్యాలయాన్ని శుక్రవారం నాడు బి ఆర్ ఎస్ అధినేత,సీఎం కేసిఆర్ గారు సందర్శించారు. మధ్యాహ్నం..1.38 గం.లకు ఆఫీస్ కు చేరుకున్న కెసీఆర్ గారు, తన ఛాంబర్ లో కూర్చొని ఎంపీలు, పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలు ప్రముఖుల తో కాసేపు చర్చించారు. కార్యాలయ మొదటి రెండో అంతస్థుల్లో, ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హల్ ను, పలువురికి కేటాయించిన చాంబర్లను, కలియతిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా, పలు సూచనలు చేశారు. తర్వాత తనను కలిసేందుకు అక్కడికి చేరుకున్న బి ఆర్ ఎస్ నేతలు,కార్యకర్తలు అభిమానులను కలిశారు.
ఢిల్లీలో పార్టీ శ్రేణులను కలిసిన కేసీఆర్
మూడు రోజుల కింద పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్.. శ్రేణులకు అందుబాటులో ఉన్నారు. మూడు రోజులూ సర్దార్‌పటేల్ రోడ్ గులాబీ శ్రేణులతో కిటకిటలాడింది. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు, దేశం నలుమూలల నుంచీ అభిమానులు పోటెత్తారు. తన వద్దకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ రంగాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ముచ్చటించారు. తనను కలిసి శుభాకాంక్షలు తెలుపడానికి వచ్చిన ప్రతి అభిమాని, కార్యకర్తను పేరుపేరునా పలకరించి, వారితో కేసీఆర్ ఫొటోలు దిగారు.
ఉత్తరాది నుంచి పలువురి మద్దతు
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు లభించింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ రాష్ర్టాల నుంచి ప్రతినిధులు.. కేసీఆర్‌ను కలిసి తాము బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయటా నికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఏపీ విశాఖపట్నంకు చెందిన గోవింద రావు బృందం కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపింది. తాము బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామని సీఎం కేసీఆర్‌కు చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ దేశంలో గుణాత్మక మార్పులు తీస్తుందనే సంపూర్ణ విశ్వాసం తమకు ఉన్నదని తెలంగాణ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పుటం పురుషోత్తం ప్రకటించారు.
బీఆర్ఎస్ కార్యవర్గంపై హైదరాబాద్‌లోనే కసరత్తు చేసే చాన్స్
పార్టీ శ్రేణులను కలవడం తప్పితే..కేసీఆర్ కీలక సమావేశాలు నిర్వహించలేదు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల కన్వీనర్లను ప్రకటించాలని అనుకున్నా.. ప్రకటన చేయలేదు. రైతు విభాగానికి మాత్రం అధ్యక్షుడ్ని ప్రకటించారు. మరోసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎప్పుడు ఉంటుందో స్పష్టత లేదు. ఓ బహిరంగసభ పెడితే కానీ బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లదన్న వాదన వినిపిస్తోంది.ఆ అంశంపై కేసీఆర్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. దక్షిణాదిలోనూ బహిరంగసభలు పెట్టేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అలాగే బీఆర్ఎస్ కార్యవర్గాన్ని కూడా కేసీఆర్ నియమించాల్సి ఉంది. దీనిపై కసరత్తును ఆయన హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారని భావిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత నిందితురాలే - సీబీఐ కోర్టు ఆమోదించిన చార్జిషీటులో సంచలన విషయాలు