Huzurabad KCR : ఖాళీ చేసి వెళ్లిపోయిన నేతలు.. హుజూరాబాద్‌లోనే ఉండాలంటున్న కేసీఆర్..!
ఉపఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేకపోవడంతో టీఆర్ఎస్ బాధ్యతలు తీసుకున్న నేతలంతా వెళ్లిపోయారు. అయితే షెడ్యూల్‌తో సంబంధం లేకుండా హుజూరాబాద్‌లోనే ప్రచారం చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికలను కేసీఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో "దళిత బంధు" పథకానికి ఇస్తున్న ప్రాధాన్యత ద్వారానే తెలిసిపోతోంది. అయితే కేసీఆర్ సీరియస్‌నెస్‌ను అర్థం చేసుకోవడంలో టీఆర్ఎస్ నేతలు విఫలమయినట్లుగా ఉంది. ఉపఎన్నిక షెడ్యూల్ ఇప్పుడల్లా వచ్చే అవకాశం లేదన్న సమాచారం బయటకు రావడంతో అందరూ హుజూరాబాద్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇంచార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న హరీష్ రావు సహా.. మండలాలు, గ్రామాల వారీగా బాధ్యతలు తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. దీంతో హుజూరాబాద్‌లో ఎక్కడివక్కడ టీఆర్ఎస్ ఫ్లెక్సీలే తప్ప క్యాడర్ కనిపించడం లేదు. లీడర్లు అసలే కనిపించడం లేదు. అందరూ రిలాక్స్ అయిపోయారు.
హుజూరాబాద్ నుంచి నేతలంతా వెళ్లిపోయారన్న సమాచారం తెలియడంతో కేసీఆర్ అందర్నీ ప్రగతి భవన్‌కు పిలిచి క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం రోజు ప్రగతి భవన్‌లో హుజూరాబాద్ ఎన్నికల అంశంపై కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. హరీష్ రావుతో పాటు బాధ్యతలు తీసుకున్న వారంతా సమావేశానికి హాజరయ్యారు. ఉప ఎన్నిక ముగిసేంత వరకు బాధ్యతలు అప్పగించిన చోట ఎక్కడివారక్కడే ఉండాలని.. ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి గడపకూ చేరేలా చేయాలని ఆదేశించారు.
టీఆర్ఎస్ వ్యూహం ప్రతి ఓటర్ని వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వ పథకాల వల్ల ఎంత లబ్ది కలిగిందో చెప్పి కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేయడం. ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వెలువడుతుందనే అంశాన్ని మర్చిపోవాలని.. రేపే విడుదలవుతుందన్నట్లుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే నెల మొదటి వారానికల్లా పూర్తి కావాలని.. దళితబంధుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకు ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ లబ్ధి జరిగేలా చూస్తామనే అంశాన్ని దళితుల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
ఇప్పటికే దళిత బంధు ప్రారంభోత్సవానికి ఓ సారి హుజూరాబాద్ వెళ్లిన కేసీఆర్ మరోసారి హుజూరాబాద్‌లో పర్యటించాలనే ఆలోచన చేస్తున్నారు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందామని ఆయన పార్టీ నేతలకు చెప్పారు. కేసీఆర్ దిశానిర్దేశంతో మళ్లీ నేతలంతా హుజూరాబాద్ బాట పట్టే అవకాశం ఉంది. ఉపఎన్నికలు ఎప్పుడు వస్తాయో కానీ.. టీఆర్ఎస్ నేతలకు మాత్రం హుజూరాబాద్ టాస్క్ చాలా క్లిష్టంగా మారింది. ఇతర పార్టీల నేతలు కూడా రిలాక్స్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఇంత వరకూ ఎలాంటి ప్రచార కార్యక్రమాలు జరగలేదు. బీజేపీ తరపున కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్రలో పాల్గొన్నారు.