KCR : ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్ .. బట్ బై చాయిస్ - 100 సీట్లు గెలవబోతున్నామన్న కేసీఆర్ !
వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలవబోతున్నామని కేసీఆర్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. అందరూ జనంలో ఉండాలని స్పష్టం చేశారు.
KCR : బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో అధినేత కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ పార్టీ గా, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేస్తూ ఎదిగిన పార్టీ నేడు దేశ ప్రజల ఆకాంక్షలను సాకారంచేసే దిశగా జాతీయ పార్టీగా ఎదిగిన క్రమాన్ని వివరించారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచామని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. కేడర్లో అసంతృప్త్తిని తగ్గించే చర్యలు చేపట్టండని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలని గైడ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద పని కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలనేది ప్రాధాన్యతాంశమని అన్నారు. ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్! బట్ బై చాయిస్ అన్నారు. దూపయినప్పుడే బావి తవ్వుదామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదని అన్నారు.
ఆరు నిమిషాల్లో అందరూ కూర్చోవాలి
కొత్త సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మధ్యాహ్నం 12.45 కల్లా అక్కడికి చేరుకోవాలని సూచించారు. మ. 1.58 నుంచి గం. 2.04 వరకు మంత్రులు వారి వారి ఛాంబర్లకు పోవాలని కోరారు. సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ లోబ్రీఫ్ మీటింగ్ ఏర్పాటు చేసి, లంచ్, తర్వాత డిస్పర్స్ కావాలన్నారు. మెయిన్ గేట్ నుంచి సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు రావాలని సూచించారు. 3వ గేట్, ఈశాన్యం గేట్ అధికారుల రాకపోకలకు ఉద్దేశించిందని తెలిపారు. ఆగ్నేయం గేటు సాధారణ విజిటర్లకు ఉద్దేశించిందని అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలివిలేదు
బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టీవీ యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ చేపట్టాలని, అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ కూడా నడపాలని తెలిపారు. తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడును దాటవేసి ముందుకు పోతున్నామని తెలిపారు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని.. మహారాష్ట్ర ప్రభుత్వానికి విజన్ లేదని పేర్కొన్నారు. రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు కేసీఆర్. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేయ గలిగామన్నారు. అదే పంథాలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ప్రభుత్వ భూములను సర్వే నెంబర్లేసి ఇవ్వండి
అకాలవర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటాం. మార్క్ ఫెడ్కు ఈ మేరకు ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నదని కేసీఆర్ గుర్తు చేశారు. దేశ జీఎస్డీపిలో వ్యవసాయరంగం వాటా 23 శాతంగా ఉందని పేర్కొన్నారు. కొన్నిగ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను సర్వే నెంబర్లేసి ఇవ్వండి.. ఇండ్లు కట్టుకోవటానికి యోగ్యంగా ఉంటే వాటిని తక్షణం పంచేద్దామన్నారు. ఈ ప్రక్రియ 3,4 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.