Viral Ghost Image: వీసా పాస్‌పోర్టు లేకుండానే ప్రపంచాన్ని చుట్టేస్తున్న దెయ్యం- తాజాగా నిజామాబాద్‌లో ల్యాండ్ అయిందట!
Nizamabad: దెయ్యాలపై ఉన్న భయాన్ని జనాలు క్యాష్ చేస్కుంటున్నారు. కొందరు వీడియోల రూపంలో మరికొందరు ఫొటోల రూపంలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నిజామాబాద్‌లో అదే జరుగుతోంది.
Viral News: సామాన్యంగా మనం హారర్ సినిమాలు చూసినప్పుడు దెయ్యం కనిపించిందంటే చాలు టక్కున భయంతో కళ్ళను మూసుకుంటారు చాలా మంది. ఇంట్లో అకస్మాత్తుగా కరెంటు పోయిందంటే చాలు చీకట్లో మన ముందు ఏదో ఆకారం తిరుగుతున్నట్టు ఎవరో నడుచుకుంటూ వెళ్లినట్టు అనిపిస్తుంది. చీకట్లో వాహనంపై వెళ్లేటప్పుడు ఉన్నట్టుండి ఏదో ఒక ఆకారం కదలికలు కనిపిస్తున్నట్టుగా ఊహించుకుంటారు కొంతమంది.
ఇదంతా ఒకఎత్తు అయితే ఇప్పడు టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఆన్‌లైన్‌లో దెయ్యాలు ఎక్కువయ్యాయి. గ్రాఫిక్స్‌తో ఇమేజ్‌లను సృష్టించి వ్యూస్ కోసం కొందరు, జనాలను భయపెట్టి ఆనందపడేందుకు మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో తిరిగిన వైరల్ ఫొటోలు ఇప్పుడు నిజామాబాద్‌లో తిరుగుతున్నాయి. ద్విచక్ర వాహనంపై చీకట్లో వెళుతున్నప్పుడు కళ్ళ ముందే దెయ్యం ఆకారంలో కనిపించినట్టు ఆ ఫొటోలు ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లాలో అదృశ్య శక్తి...
ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో తిరుగుతున్న దెయ్యం ఫొటోలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తిరిగి వచ్చేశాయి. ఒకసారి మలేసియాలో కనిపించదని కొందరు షేర్ చేశారు. తర్వాత ఛండీగడ్‌లో కనిపించింది. ఇలా ప్రపంచాన్ని చుట్టి వస్తున్న దెయ్యం ఇప్పుడు నిజామాబాద్‌లో భయపెడుతోంది.
ఫొటోలకు ఆడియోలు జత చేసి దుష్ప్రచారం
నార్మల్‌గా ఫొటోలు షేర్ చేస్తే ఎవరూ నమ్మరేమో అని... దానికి ఆడియోలను కూడా జత చేస్తున్నారు కొందరు. ఇప్పుడే చూశామని కలరింగ్ ఇస్తున్నారు. నిజామాబాద్‌లో జరుగుతుంది కూడా అదే. తెల్లవారుజామునే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులకు దెయ్యం ఆకారంలో కనిపించిందని గుండె ఆగినంత పని అయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. వాహనాన్ని కాస్త స్లో చేసే ఆ దెయ్యం ఫొటోలను తామే తీశామని గొప్పలు చెప్పుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లా రామన్నపేట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఈ ఫొటోలు షూట్ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక్కొక్కరం ఉండి ఉంటే చంపేసేదని... కానీ తము ముగ్గురం ఉండటంతో బతికిపోయామనే భయాన్ని వ్యాప్తి చేస్తున్నారు. జనాలు జాగ్రత్తగా ఉండాలంటూ ఓ విధమైన హెచ్చరికలు చేస్తున్నారు. ఆ దెయ్యం అడుగులు ముందుగు పడుతున్న కొద్దీ ఆకారాలు మారిపోతోందని యువకులు ఓ ఆడియోను రికార్డు చేసి జనాల్లోకి వదిలారు.
మరికొందరు ఇది దెయ్యం కాదని... గ్రహాంతరవాసులు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అడ్డమైన ప్రచారంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వైరల్ అవుతున్న ఫొటోలు నిజమే అని నమ్మిన కొందరు సాయంత్రం అయితే చాలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఊరు దాటి వెళ్లేందుకు కొందరు జడుసుకుంటున్నారు.
తప్పడు ప్రచారాన్ని నమ్మొద్దు- ఆ ఫొటోలు నిజామాబాద్‌లోని కాదు
నిజామాబాద్‌లో దెయ్యం అంటూ తిరుగుతున్న ఫొటోలు ఇక్కడవి కాదు. ఇప్పటికీ ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఎక్కడి నుంచి ప్రచారం మొదలైందనే విషయంపై క్లారిటీ లేదు. ఫొటోలు కూడా నిజమైనవి కావని... వేర్వేరు ఫొటోలను ఇలా గ్రాఫిక్స్ జత చేసి దెయ్యం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నమ్మి భయపడాల్సిన అవసరం లేదు.
Also Read: చుక్క బొట్టు వేస్తే గాని అక్కడి అమ్మాయిలకు పెళ్లి జరగదు, తరతరాలుగా అదే సాంప్రదాయం