Telangana Govt Schools: సర్కారు బడుల్లో సోలార్ ప్యానెల్స్ - విద్యుత్ భారం తగ్గించుకునేందుకు నయా ప్లాన్ !
Telangana Govt Schools: తెలంగాణలోని సర్కారు బడుల్లో సోలార్ ప్యానెల్స్ బిగించనున్నారు. విద్యుత్తు నిర్వహణ భారాన్ని తగ్గించేందుకు విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టింది.
Telangana Govt Schools: ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిన విద్యాశాఖ మరో కీలక అడుగు వేస్తోంది. ప్రభుత్వ బడుల్లో విద్యుత్ నిర్వహణ భారాన్ని తగ్గించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మన ఊరు మనబడి కింద అభివృద్ధి పనులు చేపట్టిన పాఠశాలల్లో సోలార్ విద్యుత్ నిర్వహణ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా తెలంగాణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ రెడ్కో విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సౌర విద్యుత్తు ఫలకలను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడుతలో 13 పాఠశాలల్లో ఫిక్స్ చేయనుండగా ఎంపిక చేసిన స్కూల్లో రెండు కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. దీనికి సంబంధించి రెడ్కో అధికారులు సోమవారం నుంచి వివరాలు సేకరించినన్నారు. ఈ నివేదిక ఆధారంగా పాఠశాలల్లో నెట్ మీటరింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు.
మంజూరవుతున్న నిధుల్లో ఎక్కువగా కరెంట్ బిల్లుల చెల్లింపు..
ప్రభుత్వ స్కూళ్లకు కొన్ని నిధులే వస్తుండడంతో నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కనీసం చాక్ పీస్ లను కూడా కొనుగోలు చేసుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల సగం వాటా నిర్వహణ నిధులు మంజూరు చేశారు. వంద మంది లోపు విద్యార్థులు ఉంటే ఏడాదికి రూ.25 వేలల్లో సగం అంటే రూ.12,500, 100 మందికిపైగా ఉన్నవాటికి రూ.50,000 ఉండగా 25 వేలు మంజూరు చేయడం కాస్త ఊరటం కలిగిస్తోంది. మంజూరు అవుతున్న నిధుల్లో ఎక్కువగా కరెంట్ బిల్లుల చెల్లింపునకు ఖర్చు చేస్తున్నారు. కొన్ని నెలలుగా బిల్లు కట్టకపోవడం వల్ల బకాయిలు పెరిగిపోతుండడంతో పలుచోట్ల కనెక్షన్లు తొలగిస్తున్నారు. మౌలిక వసతులపై అధికారులు సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. సౌర పలకల ఏర్పాటు ఇతర పరిస్థితులపై సర్వే చేసి నివేదిక రూపొందించనున్నారు. ఈ క్రమంలోనే స్కూళ్లలో అవసరం, ఉత్పత్తిపై సాధ్యాసాధ్యాలను అంచనా వేయనున్నారు.
సోలార్ ప్యానెళ్ల ద్వారా గణనీయంగా తగ్గనున్న విద్యుత్ బిల్లులు..
ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థల్లో ఉత్పత్తి చేస్తున్న సౌర విద్యుత్ లో అవసరం మేరకు వాడుకొని మిగులిన దాన్ని వదిలేసే పరిస్థితి ఉంది. ఇకపై అలా కాకుండా విద్యుత్ వృథా చేయకుండా అవసరాల మేరకు వినియోగించుకొని మిగిలిన దాన్ని గ్రిడ్ ద్వారా డిస్కౌంట్లకు విక్రయించుకునే అవకాశం ఉంది. బడుల్లో కంప్యూటర్లు, ఫ్యాన్లు, మోటార్ నడవడానికి ఎక్కువ కరెంట్ వినియోగిస్తున్నారు. సౌర పలకలు ఏర్పాటుతో ప్రతి పాఠశాలలో రెండు కిలో వాట్స్ విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. ఒక కిలోవాటు ఉత్పత్తి చేయడానికి రూ.50,000 చొప్పున రెండింటికి కలిపి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సోలార్ ద్వారా ఉత్పత్తి అయినా కరెంటును గ్రిడ్ కు అనుసంధానిస్తారు. బ్యాటరీ ఇన్వర్టర్ ద్వారా సౌర విద్యుత్తు నిలువ చేసుకుని పాఠశాలల్లో అవసరం మేరకు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలో పెద్ద పల్లి జిల్లాలో 17 పాఠశాలలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో 18, కరీంనగర్ జిల్లాలో 27, జగిత్యాల జిల్లాలో 41 పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఈ పథకం గనుక అమలవుతే విద్యుత్తు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.