Bandi Sanjay Bail: పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు - విడుదల ఎప్పుడంటే!
Court grants bail to Bandi Sanjay: టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఊరట లభించింది. హన్మకొండ కోర్టు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేసింది.
Hanmakonda Court grants bail to Bandi Sanjay: టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు స్వల్ప ఊరట లభించింది. పేపర్ లీకేజీ కేసులో హన్మకొండ కోర్టు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేసింది. రూ. 20 వేల పూచికత్తు, ఇద్దరి వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. డిఫెన్స్ వాదనలతో ఏకీభవించిన అనంతరం హన్మకొండ కోర్టు బండికి బెయిల్ మంజూరు చేసింది.
బండి సంజయ్‌కి హన్మకొండ మెజిస్ట్రేట్ బుధవారం నాడు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు. అయితే బీజేపీ లీగల్ సెల్ టీమ్ సంజయ్ తరఫున హన్మకొండలో బెయిల్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై గురువారం మధ్యాహ్నం నుంచి 8 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం ఇద్దరు వ్యక్తుల హామీ, రూ.20 వేల పూచీకత్తుతో హన్మకొండ కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఉదయం అన్ని ఫార్మాలిటిస్ పూర్తయితే రేపు మధ్యాహ్నం బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదల కానున్నారు. బండి సంజయ్ కు బెయిల్ మంజూరైందని తెలియగానే బీజేపీ శ్రేణులు సెలబ్రేషన్ మొదలుపెట్టాయి.
తన పాత్ర లేకపోతే బండి సంజయ్ ఫోన్ ఎందుకు ఇవ్వట్లేదు..?
మరోవైపు పేపర్ లీకేజీ వ్యవహారంలో సంజయ్ పాత్ర లేకపోతే ఫోన్ దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది..? ఆయన ఫోన్ ఇస్తే కీలక సమాచారం బయటకు వస్తుంది. ఫోన్ ఎందుకు తేలేదు..? ఆ ఫోన్ తెస్తే అంతా బయటపడుతుంది..అని వరంగల్ సీపీ రంగనాథ్ చెబుతున్నారు. బండి సంజయ్ తన ఫోన్‌ను పోలీసులకు ఇవ్వలేదని లేదని చెబుతున్నారని ఆయన అంటున్నారు. కానీ బండి సంజయ్ తన ఫోన్ ను ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్న సమయంలో కూడా ఉపయోగించిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. మరి పోలీసులు ఆయన ఫోన్‌ను ఎందుకు తీసుకోలేదు? తీసుకుకోకుండ ఇవ్వలేదని చెబుతున్నారా? అన్న సందేహాలు వస్తున్నాయి. ఫోన్ కావాలనే తీసుకోలేదని.. కోర్టుల్లో అదే విషయం చెప్పి బెయిల్ రాకుండా చేసే ప్రయత్నమని బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. రిమాండ్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణలో ప్రభుత్వం తరపు న్యాయవాది బండి సంజయ్ ఫోన్ ఇంకా ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బీజేపీ నేతుల ఇదే అంశంపై ఆరోపణలు చేస్తున్నారు. బండి సంజయ్ ఫోన్ కు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా తాను ఫోన్ చేసి మాట్లాడానని బీజేపీ నేత డీకే అరుణ చెబుతున్నారు. దీంతో అసలు ఫోన్ రాజీకీయం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు నోటీసులు
పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో ఇప్పటికీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే ఇదే కేసు ఇప్పుడు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మెడకు కూడా చుట్టుకునేలా కనిపిస్తోంది. తాజాగా గురువారం హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటలకు కూడా వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని ఈటలకు ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. అయితే శామీర్‌పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి కమలాపూర్ పీఎస్ ఎస్ఐ నేరుగా వెళ్లి నోటీసులు అందజేశారు.