కరీంనగర్ కోర్టుకు వచ్చిన కంచె ఐలయ్య
కరీంనగర్ కోర్టుకు ప్రొఫెసర్ కంచె ఐలయ్య హాజరయ్యారు. న్యాయవ్యవస్థను కించపరిచారని గతంలో న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి వేసిన కేసులో కోర్టుకు హాజరయ్యారు.
Professor Kanche Ilaiah: ప్రొఫెసర్ కంచె ఐలయ్య కరీంనగర్ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తులు, న్యాయవాదులపై కంచె ఐలయ్య రాసిన "మనతత్వం" పుస్తకంలో అనుచిత పదాలు వాడారంటూ కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాది, బీజేపీ నాయకుడు బేతి మహేందర్ రెడ్డి 2017లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కరీంనగర్ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
అసలేం జరిగిందంటే..?
బీజేపీ నాయకులు, కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి 2017లో స్థానిక ఒక బుక్ స్టాల్ లో కంచె ఐలయ్య రాసిన మనతత్వం పుస్తకం కొనుగోలు చేశారు. అందులో న్యాయ వ్యవస్థలోని బ్రాహ్మణ, బనియ, క్షత్రియ న్యాయమూర్తులు అయ్యే వ్యక్తులకు, సమాజ చట్టం, సమాజంలోని సంబంధాల విలువలు, సమాజంలోని ప్రజలందరి తిండి రుచులు, పెండ్లి పద్ధతులు ఏం తెలియవని పేర్కొన్నట్లు వివరించారు. ఇదే కాకుండా చెట్టు కింద జరిగే కోర్టుల్లో తగువుదారులు.. వాది, ప్రతివాదులని అక్కడ పైసల కోసం పని చేసే వకీళ్ల ఉండరని ఆయా నిర్ణయాల్లో అమ్మలక్కల పాత్ర ప్రధానమైన పాత్ర అని చెప్పినట్లు వివరించారు. వారికి ఉన్న న్యాయ పరిజ్ఞానం జడ్జిలకు, వకీళ్లకు ఉండే జ్ఞానంలో సగం కూడా ఉండదంటూ.. న్యాయం పొందే అవకాశం అక్కడ లేదంటూ పుస్తకంలో రాయడం బాధాకరమన్నారు.
న్యాయవాదులను, కోర్టును అవమానించే విధంగా ఉందంటూ..
ఇలాంటి వ్యాఖ్యలతో న్యాయ మూర్తులను, న్యాయవాదులను తీవ్ర మనోవేదనకు గురి చేయడమే కాకుండా న్యాయ వ్యవస్థనే కించ పరిచే విధంగా, అవమానించే విధంగా ఉందని బేతి మహేందర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పుస్తకంలో కంచె ఐలయ్య రాసిన వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయని బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ ఒకటో పోలీసులకు, సీపీలకు ఫిర్యాదు చేయగా వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో 2వ అదనపు మున్సిఫ్ కోర్టులో పూర్తి ఆధారాలతో తన న్యాయవాది ఎన్నంపల్లి గంగాధర్ ద్వారా పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన కోర్టు కంచె ఐలయ్యపై క్రైం నెంబర్ 484/2017 ద్వారా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది.
నవంబర్ 28వ తేదీన పూచీకత్తులు సమర్పించాలని..
దీంతో అప్పటి కరీంనగర్ ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్ తుల శ్రీనివాస్ రావు.. కేసును దర్యాప్తు చేసి 501(బి), 505(1)(సి), 505(2) ఐ.పి.సి సెక్షన్ల క్రింద కోర్టులో చార్జ్ షీట్ ఫైల్ చేశారు. కేసును విచారిస్తున్న కోర్టు కంచె ఐలయ్యకు సమన్లు జారీ చేసి కోర్టులో అక్టోబర్ 12వ తేదీన హాజరు పరిచల్సిందిగా పోలీసులను ఆదేశించడంతో ఈ రోజు కంచె ఐలయ్య 2వ అదనపు మున్సిఫ్ కోర్టులో తన న్యాయవాది ద్వారా హాజరయ్యారు. నవంబర్ 28వ తేదీన కంచె ఐలయ్య తరపున 2పూచికత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
అయితే కంచె ఐలయ్య రాసిన ఈ ఒక్క పుస్తకంపైనే కాదు గతంలోనూ చాలా విషయాల్లో ఆయన విమర్శలను ఎదుర్కున్నారు. ముఖ్యంగా నేను హిందువునెట్లయిత, సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకాలు, వాటి పేర్లపై చాలా వ్యతిరేకత వచ్చింది.