Mancherial Crime News: యువతిని వేధిస్తున్నాడని నడిరోడ్డుపై యువకుడి హత్య- లైవ్ లో మర్డర్ చూసిన జనానికి చెమటలు
Mancherial Crime News: పెళ్లైన యువతిని వేధిస్తున్నాడని ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. లైవ్ మర్డర్ చూసిన జనం షాక్ తిన్నారు.
Mancherial Crime News: మంచిర్యాల జిల్లా జైపూర్్ మండలం ఇందారంలో జరిగిన హత్యను చూసిన ప్రజలు ఒక్కసారిగా భీతిల్లిపోయారు. ఊరంతా చూస్తుండగానే ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారు. ఇదంతా అక్కడి వాళ్లు షూట్ చేశారు.
ముస్కె మహేష్ అనే వ్యక్తి బైక్ లో వెళ్తుండగా అటాక్ జరిగింది. పెట్రోల్ బంక్ పక్కనే అడ్డగించిన నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ముందు దాడి చేశారు. తర్వాత గొంతు కోశారు. ఆ పై ఇంకా ప్రాణం ఉందని గ్రహించి పెద్ద బండరాయి తీసుకొచ్చి తలపై వేశారు.
ఈ తంతంగాన్ని అక్కడి వారంతా తమ మొబైల్స్ షూట్ చేస్తున్నారే తప్ప మూకుమ్మడిగా వెళ్లి దాడిని అడ్డుకుందామన్న ఆలోచన ఎవరికీ రాలేదు. దాడిని చూస్తూ ఏదో సినిమాషూటింగ్ చూస్తున్నట్టు నిలబడిపోయారు.
అసలు దాడి ఎందుకు జరిగిందని పరిశీలిస్తే.. ఇందారం గ్రామానికి చెందిన ఓ యువతితో మహేష్ కు మధ్య ప్రేమాయనం సాగుతోంది. ఈ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కకుండానే ఫెయిల్ అయింది. ఇంతలో వేరే వ్యక్తికో ఆ యువతికి పెళ్లి కూడా జరిగిపోయింది.
ప్రేమించిన యువతికి పెళ్లిపోయిందన్న విషయాన్నిజీర్ణించుకోలేకపోయిన మహేష్ తరచూ ఆమెకు ఫోన్ చేసేవాడు. మెసేజ్ లు పంపించేవాడు. దీన్ని గ్రహించిన యువతి బంధువులు మహేష్్కు వార్నింగ్ ఇచ్చారు. అయినా అతనిలో మార్పు రాలేదు. చివరకు విసిగిపోయి హత్య చేశారు.
ఉదయం పెట్రోల్ కొట్టించుకొని తిరిగి వస్తున్న టైంలో మహేష్ పై యువతి తరఫు బంధువులు దాడి చేశారు. ఊరందరూ చూస్తుండగానే అతి దారుణంగా హత మార్చారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. మహేష్ వివరాలు తెలుసుకున్నారు. వారి ఫ్యామిలీ నుంచి పూర్తి వివరాలు తెలుసుకొని చంపింది మాజీ ప్రేయసి బంధువులేనని నిర్దారణకు వచ్చారు. వెంటనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. విచారణ చేపట్టారు.
తమవారు ఎలాంటి తప్పు చేయలేదని నిందుతుల తరఫు బంధువులు ఆందోళన చేపట్టారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
మహేష్ పై యువతి బంధువులు ఫిర్యాదు చేశారనే మాట వినిపిస్తోంది. పెళ్లైన తమ బిడ్డను నిత్యం వేధించేవాడని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారని టాక్. అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదని విమర్శులు వినిపిస్తున్నాయి. అందుకే విసిగిపోయి దాడికి తెగబడ్డట్టు వారు చెబుతున్నారు.