Telangana News: బీ"ఆర్"ఎస్‌ది ఫెవికాల్ బంధం- ట్రిపుల్ ఆర్ వసూళ్లను మించేలా డబుల్ ఆర్ వసూళ్లు - వేములవాడ ప్రచార సభలో మోదీ విమర్శలు
Telugu News: వేములవాడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై విరుచుకు పడ్డారు. వాళ్లంతా కుటుంబ కోసమే శ్రమిస్తారని ఆరోపించారు.
Modi Vemulawada Tour: వేములవాడలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పదేళ్లలో తన పనితనం చూసి ఈసారి ఓట్లు వేయాలన్నారు మోదీ. ఇక్కడ ఉన్న పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. వాళ్లకు ప్రజల బాగోగులు పట్టబోవని విమర్శించారు. ప్రజల తరఫున మొదటి నుంచి ఇక్కడ పోరాటాలు చేస్తోంది ఒక్క బీజేపీ మాత్రమే అన్నారు.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసును తొక్కిపెట్టిందని పూర్తిగా విచారణ జరపలేదన్నారు మోదీ. కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించిందని గుర్తు చేశారు. ఇప్పుడు దాన్ని విచారణ చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
తెలుగులో ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చిందని... దాని కంటే ఇప్పుడు డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చర్చ సాగుతోందన్నారు ప్రధాని. ట్రిపుల్ ఆర్ వసూళ్ల కంటే ఎక్కువ ఈ వసూళ్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇప్పుడు అమలు అవుతున్న ఆర్ ఆర్ ట్యాక్స్ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందని అన్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు దీని గురించి మాట్లాడుకుంటున్నారన్నారు. ప్రతి పిల్లాడికి కూడా తెలుసు అన్నారు. ఇక్కడ ఆర్ అనే వ్యక్తి తెలంగాణను లూటీ చేసి ఢిల్లీలో ఉన్న ఆర్‌కు ఇస్తున్నారని ఆరోపించారు.
Opposition in Telangana has already accepted defeat as people have decided to bless the BJP with record numbers. Watch from Karimnagar.https://t.co/OYzUIE8vbW
— Narendra Modi (@narendramodi) May 8, 2024
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు తొలి ప్రాధాన్యం కుటుంబమేనన్నారు ప్రధానమంత్రి మోదీ. బీజేపీకి మాత్రం తొలి ప్రాధాన్యం దేశమే ఉంటుందని తెలిపారు. కుటుంబ వల్ల, కుటుంబం కోసం, కుటుంబం చేత నినాదంతోనే ఈ రెండు పార్టీలు పని చేస్తాయని అన్నారు. అందుకే ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మబొరుసు అన్నారు.
తెలంగాణ ప్రజల కలలను రెండు పార్టీలు కాలరశాయాన్నారు మోదీ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అద్భుతాలు జరుగుతాయని అంతా భావించారు కానీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వాటిని చిదిమేశారన్నారు. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ ఆస్తులు కూడబెట్టేందుకు మాత్రమే పని చేస్తున్నాయన్నారు.
రెండు పార్టీలది ఫెవికాల్ బంధమన్నారు మోదీ. వారి ఆటలను, ఆర్ పని తీరును ప్రజలు గమనిస్తున్నారని కచ్చితంగా ఈ ఎన్నికల్లో రెండు పార్టీలకు గట్టిగానే ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు మోదీ. మాజీ ప్రధాని పీవీ కుటుంబాన్ని కూడా గౌరవించుకోలేదన్నారు. ఆపని చేసింది ఒక్క బీజేపీ మాత్రమే అన్నారు. ఆయన్ని గౌరవించకపోగా... తీవ్రంగా అవమానించిందని ఆరోపించారు.
అంతకు ముందు వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక పూజలు చేశారు. కోడెలు దానం ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
నిన్న హైదరాబాద్ చేరుకున్న ప్రధామంత్రి మోదీని మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుటుంబం కలిసింది. పీవీకి భారత రత్న ప్రకటించనందుకు థాంక్స్ చెప్పింది. ఈ సందర్భంగా చాలా అంశాలపై మాట్లాడుకున్నట్టు మోదీ ట్వీట్ చేశారు.