News
News
X

Mallojula Venugopal Rao: తల్లి మరణంపై మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ భావోద్వేగ లేఖ!

Mallojula Venugopal Rao: అమ్మా నన్ను మన్నించంటూ తల్లి మరణంపై మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెంట్రల్ మెంబర్ మల్లోజు వేణు గోపాల్ రావు లేఖ రాశారు. 

FOLLOW US: 

Mallojula Venugopal Rao: తన తల్లి మరణంపై మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు భావోద్వేగ లేఖ రాశారు. అమ్మా నన్ను మన్నించంటూ లేఖను మొదలు పెట్టారు. మీ అంత్యక్రియలకు రాలేనందుకు చింతిస్తున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు. పెద్దపల్లి పెద్దవ్వలేదని మావోయిస్టు పార్టీ మొత్తం ఏడుస్తుందని అన్నారు. తల్లి మరణం తల్లికే కాదు యావత్ మావోయిస్ట్ కుటుంబ సభ్యులకి తీరని లోటు అన్నారు. మల్లోజుల కోటేశ్వర రావు, వేణుగోపాల్ రావు లాంటి సామాన్య వ్యక్తులను.. మావోయిస్ట్ పార్టీ కోసమే కన్నావని చెప్పుకొచ్చారు. అలాగే నీకు పుట్టిన చివరి కొడుకును.. చివరి వరకూ ఏడిపించన వాడినంటూ చెప్పుకొచ్చారు. నువ్వున్నంత వరకు మేము క్షేమంగా ఉండాలని నీవు కోరుకునే చివరి కోరికనే తీర్చాననే తృప్తిని మాత్రం నీకు మిగిల్చానని వివరించారు. 

మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు తల్లి మల్లోజుల మధురమ్మ (100) నవంబర్ ఒకటవ తేదీన అనారోగ్యంతో మృతి చెంందారు. మూడు నెలల క్రితం ఇంటి ఆవరణలో జారి పడగా తుంటి ఎముక విరిగింది. వైద్యులు సర్జరీ చేసి ఇంటికి పంపించారు. వారం రోజుల క్రితం మళ్లీ అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై ఉంచారు. ఇంటి ఆవరణలోనే తుది శ్వాస విడవాలన్న ఆమె కోరికపై పెద్దపల్లిలోలని తన సొంతింటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన రోజునే ఆమె చనిపోయారు. 

లేఖలో ఏముందంటే..?

అమ్మా, మల్లోజల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ, నీను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా. అయితే, నీవున్నంత వరకు మేం క్షేమంగా వుండాలనీ సదా కోరుకునే నీ చివరి కోరికను మాత్రం తీర్చి నీకు ప్రజలు తృప్తిని మిగిల్చారమ్మా. ఇప్పటివరకూ వాళ్లే నన్ను క్షేమంగా కాపాడుకుంటున్నారమ్మా. జనం మధ్య, జనం కోసం, జనంతో వున్న నేను నీ అంత్యక్రియలైనా చూడలేకపోయానమ్మా, అయితేనేం, వేలాది జనం, విప్లవ సానుభూతిపరులు, విప్లవ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, మితృలు నిన్ను ఘనంగా సాగనంపారమ్మా. నీ పార్థివ శరీరంపై వాళ్లు ఎర్రగుడ్డ కప్పుతారనీ, విప్లవ నినాదాలతో నీకు వీడ్కోలు చెపుతారనీ నిజంగానే నేను ఊహించలేకపోయానమ్మా. ఎందుకంటే చాలా మంది సోదర విప్లవకారుల తల్లులకు ఇలాంటి గౌరవం దక్కడం లేదమ్మా. నాతో పాటే అడవిలో మన పక్కూరు జోగన్న వున్నాడు. వాళ్ల తల్లి చివరి రోజులలో దిక్కులేని జీవితం గడిపి వీధుల్లో అడుక్కుతింటూ తనువు చాలించిందనీ విన్నపుడు ఆయనతో పాటు మేమనుభవించిన వేదన అక్షరాలలోకి అనువదించలేనిదమ్మా. పైగా 'అభాగ్యులైన' దళితులకు ఈ నికృష్ట బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో దక్కే స్థానం తెలుసు కదా! వాటన్నింటిని అంతం చేసి నిజమైన కుల విముక్త, దోపిడీ విముక్త, జెండర్ వివక్షకు తావులేని సమాజ నిర్మాణానికి అంకితమైన విప్లవకారులకు జన్మనిచ్చిన వారంతా విప్లవ మాతృమూర్తులేనమ్మా, వారంతా గౌరవనీయులే. నీతో సహ వారందరికి శిరస్సు వంచి వినమ్రంగా విప్లవాంజలులు ఘటిస్తున్నానమ్మా..

News Reels

నీ అంత్యక్రియలలో పాల్గొన్న వారందరికి అశ్రు నయనాలతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారు పాడిన పాటలు నా చెవులలో ఇంకా, ఇంకా నేనున్నంత వరకు ప్రతిధ్వనిస్తునే వుంటాయి. అమ్మ, వలపోతగా నా సహచర సోదరులు చేసిన గానం నా గుండెలలో భద్రంగా వుంటుందమ్మా. నేను వారి ఆశలను వమ్ము చేయకుండా, నీకూ, అమరుడైన నా సోదరునికి మన కుటుంబానికి ఏ కళంకం రాకుండా, జనానికి దూరం కాకుండా తుదివరకూ నమ్మిన ఆశయాల కోసం నిలబడుతాననీ మరోసారి హామీ ఇస్తున్నానమ్మా.. "పెద్దపల్లి పెద్దవ్వ" లేదనీ, "విప్లవ మాతృమూర్తి కన్ను మూసిందనీ", "అమ్మా మళ్లీ పుడుతావా" అంటూ అనేక విధాలుగా నీ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ తమ భావాలకు అక్షరరూపం ఇచ్చిన కలం యోధులందరికీ వినమ్రంగా ఎర్రెర్ల వందనాలు తెలుపుకుంటున్నాను. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సంకెళ్లు నుండి దేశ విముక్తి కోసం బాపు పోరాడాడు. అన్న, దోపిడీ విముక్తి కోసం పోరాడుతూ ప్రాణ త్యాగం చేశాడు. దేశం నుండి సామ్రాజ్యవాదులు వెళ్లిపోయినా దోపిడీ అంతం వరకు పోరాడాలనీ షహీద్ భగత్ సింగ్ అన్నాడు. మహాకవి శ్రీ శ్రీ తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు.. నల్లవాడు నిన్ను నేడు నక్సలైట్ అంటున్నాడు. ఎల్లవారు మిమ్ము రేపు వేగుచుక్కలంటారని చెప్పాడు. నువు అలాంటి వేగుచుక్కలను కన్నతల్లివి. నిన్ను వీరమాతగా ప్రజలు గుర్తిస్తున్నారమ్మా. బయటి పత్రికలు నీ త్యాగాన్ని ఎత్తిపడుతున్నట్టే, లోపల నాకు నా సహచర కామ్రేడ్స్ నుండి అందుతున్న సాంత్వన సందేశాలలో ఒకరు "అమ్మ చివరి వరకు కూడ విప్లవకారులకు స్ఫూర్తిదాయకంగా వుంది. 

తన ఇద్దరు కొడుకులను ఉద్యమానికి అంకితం చేసింది...... పిల్లలను ఉద్యమానికి అంకితం చేసిన వీరమాతకు విప్లవ జోహార్లర్పిద్దాం" అంటూ రాస్తే, మరో కామ్రేడ్, "మధురమ్మ నిజంగానే మధురమైన గొప్ప మాతృమూర్తిగా నిలిచిపోయింది. రాంజీదాదా (కోటన్న) కూడ మాకు అమ్మ గురించి చెప్పేవాడు. అమ్మకు జోహార్లు చెపుదాం", అంటూ రాసింది. పోతే, మరో నాయకత్వ కామ్రేడ్ నిన్ను గుర్తు చేసుకుంటూ, " నేను చివరిసారి 1980 వేసవిలో అమ్మా-బాపును కలిశాను. నేను ఎప్పుడు ఇంటికి వెళ్లినా నీవు లేకపోయినా మా అమ్మ లాగే ''తిని పో బిడ్డా' అనేది. అడవిలో ముదిమి వయసులోని తల్లులు వచ్చి ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నపుడు నాకు అమ్మా-నాన్నలే గుర్తొస్తారు. వాళ్లలోనే మన అమ్మా-బాపులను చూసుకుందాం" అంటూ ఓదారుస్తూ రాశాడు. మరో కామ్రేడ్ "అమ్మ మరణవార్త అందరినీ కలచివేసేదే. భారత విప్లవోద్యమానికి సేవలందించే పుతృలను ఇచ్చిన తల్లి. శతృవు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజల పక్షం నిలిచిన మాతృమూర్తి. అమ్మకు అందరం విప్లవ జోహార్లర్పిద్దాం". ఇలా సహచర కామ్రేడ్స్ అంతా నీ సేవలను గుర్తు చేసుకుంటున్నారమ్మా. జన్మనిచ్చిన నా తల్లి రుణం ఎర్ర జెండా సాక్షిగా నేను ఆమెను సదా పీడిత ప్రజలు గుర్తుంచుకునే విధంగా వారి విముక్తికి అంకితమై తీర్చుకుంటానమ్మా.

నీ మరణ వార్త మాకు మరు క్షణంలోనే తెలియదనీ, మన మధ్య ఎలాంటి ఆన్ లైన్ సంబంధాలు లేవనీ, వుండవనీ తెలిసినా, కడసారి చూపుకైనా నేను రాలేననీ వందశాతం వారికి తెలిసిందే అయినప్పటికీ, ఈ ఆఖరి నిముషంలోనైనా పెద్దపల్లి పెద్దవ్వకు ఖాకీ రాబందుల పొడ పడకుండా ప్రాణం పోతులేదు కదా అని జనం తిట్టిపోసుకుంటారనీ లోలోపల బాధగా చాలా మందికి వున్నప్పటికీ హృదయమున్న పీడిత ఖాకీ సోదరులు విధిలేక యధావిధిగా తమ బాస్ ల ఆదేశాల ప్రకారం నీ అంతిమ యాత్రకు కాపలా విధులు నిర్వహించడం రాజ్య స్వభావాన్ని వెల్లడి చేస్తుందమ్మా. అయితే, నీ మరణంతో వారు ఇక గతంలో తరచుగా మన కడప తొక్కే అవసరం లేకుండా చేశావమ్మా. నీవు లేకున్నా మిగిలిన నా సోదరుని కుటుంబాన్నైనా ఇకపై వాళ్లు వేదించకుండా వుంటారనుకోగలమా! బ్రాహ్మణవాదం పరమ దుర్మార్గమైనదమ్మ, పగ తీర్చుకునేవరకు సీగలు ముడివేయని పాఖండులమ్మా పాలకులు. నీకు మూడేళ్ల వయసులోనే బాపుతో పెళ్లి జరిపించారని చెప్పేదానివి. ఫలితంగా చిన్న వయసులోనే నీ కడుపున పుట్టిన బిడ్డలు నీకు దక్కడం లేదనీ వరుసగా ముగ్గురిని కోల్పోయిన తరువాత బాపు హేతువాదే అయినప్పటికీ నీవు మాత్రం రాతి దేవుళ్లను కడుక్క తాగి, మట్టి దేవుళ్లను పిసుక్కు తాగి మమ్మల్ని ముగ్గురిని బతికించుకున్నానని మాకు ఏ చిన్న ఇబ్బంది కలిగిన ఏడుస్తూ చెప్పేదానివి అమ్మా.. ముగ్గురు పోగా మిగిలిన మా ముగ్గురిలో చెట్టెత్తు నీ నడిపి కొడుకును (మల్లోజల కోటేశ్వర్లు) విప్లవకారుడని, ప్రమాదకరమనీ 57వ ఏట దోపిడీ రాజ్యం పొట్టనపెట్టుకోగా అతడు ఆపాదమస్తకం గాయాలతో విగతజీవిగా నీ ఇంటికి, నీ ముందుకు రాక తప్పలేదమ్మా. నీవు ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయావు. కానీ, దోపిడీ రాజ్యం నిర్ధాక్షిణ్యమైనదమ్మా. అందుకే అన్నింటికీ తెగించి పేదల రాజ్యం కోసం పోరాడక తప్పదమ్మా.

నీవు బతికున్నంతవరకు నీ కొడుకులు క్షేమంగా వుండాలనీ నిత్యం కోరుకుంటూ వుండేదానివి అమ్మా. కానీ, అన్నను రాజ్యం హత్య చేసింది. కానీ, ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పీడిత ప్రజలు ఆయన విప్లవ సేవలను స్మరించుకుంటూ గత సంవత్సరం కూడ ఆయన దశ వర్ధంతి వేళ 'ప్రహార్' దాడిని ఓడిద్దామని ప్రతిన బూని ఆయన అమరత్వాన్ని చాటుతూ 'ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలని' నినదిస్తూ ఆయన ఆశయాల సాధనకై ప్రతిన పూనారమ్మా. అమరులను స్మరించుకునే ప్రతి నిముషం వారిని కన్న వారు గూడ గుర్తొస్తారు. ఆ రకంగా మన రక్త బంధం చరిత్రలో విప్లవ బంధంగా నిలిచిపోయి అజరం అమరం అయిందని అనుకోవచ్చమ్మా. నా ప్రజలకు తుదివరకు సేవ చేసి నీ రుణం తీర్చుకుంటానమ్మా. నీ కడుపున పుట్టినందుకు సంతోషంగా వుంది.

ప్రతి తల్లీ తన బిడ్డలు ఎలాంటి వారైనప్పటికీ సహజంగానే పేగు బంధంతో తుది వరకూ వారి బాగునే కోరుకుంటుందమ్మా. నేను నీకు తెలియనంత చేరువలో, నీ చెంతలోనే, ప్రపంచమే ఒక పల్లెగా మారిన వేళ నేనున్నప్పటికీ నిన్ను చూడలేని నిర్బంధ పరిస్థితులలో వుండడం నా తప్పిమీ కాదమ్మా. నిర్దాక్షిణ్యమైన ఫాసిస్టు పాలకుల పాలన అలాంటిదమ్మా. తల్లులకు బిడ్డలను దూరం చేస్తున్నారు, కట్టుకున్నదానికి తన వాన్ని కాకుండా చేస్తున్నారు. పల్లెల్లో పడచు బిడ్డల బతుకులను బుగ్గి పాలు చేస్తున్నారు. రైతును పంటకు దూరం చేస్తున్నారు. అడవులను ఖాకీమయం చేస్తూ మూలవాసులను అడవికీ పరాయివాళ్లుగా చేస్తున్నారు. కార్మికులను వీధుల పాలు చేస్తున్నారు. ముస్లిం, దళిత సోదరులను ఊచకోత కోస్తున్నారు. వాళ్ల దాష్టీకాలను ఎన్నని రాయను తల్లీ! ఇప్పటివరకూ నా మనసులోని భావాలను నీతో పంచుకోవడానికి చాలా సందర్భాలలో పౌర, పోలీసు అధికారులే అవకాశాలను కల్పించారమ్మ. నీతో పాటు వాళ్లూ గుర్తుంటారు. చరిత్ర అంటేనే మంచితో పాటు చెడు కూడ నమోదవుతుంది కదా! 800 ఏళ్ల తరువాత తమకు అధికారం దక్కిందనీ హిందుత్వ శక్తులు సంబురపడుతూ కాషాయ జెండాను ఎగురేయడానికి ప్రపంచ పెట్టుబడులకు ఎర్ర తివాచీలు పరుస్తున్నారు. వారి కార్పొరేటీకరణకు, అడవులను వారి భద్రతా బలగాలతో నింపేస్తున్నారు. ఫలితంగా దేశం కార్పొరేటీకరణ-సైన్యకరణకు వ్యతిరేకంగా నినదిస్తున్నది.

Published at : 13 Nov 2022 02:18 PM (IST) Tags: Peddapalli News Mallojula Venugopal Rao Mallojula Madhuramma Mallojula Emotional letter Mallojula Veugopal Rao Latest News

సంబంధిత కథనాలు

Karimnagar Cable Bridge : కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్, త్వరలో అందుబాటులోకి కేబుల్ బ్రిడ్జి!

Karimnagar Cable Bridge : కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్, త్వరలో అందుబాటులోకి కేబుల్ బ్రిడ్జి!

Peddapalli Crime News: అప్పు ఇచ్చిన పాపానికి దివ్యాంగుడిపై దాడి, ఏం జరిగిందంటే?

Peddapalli Crime News: అప్పు ఇచ్చిన పాపానికి దివ్యాంగుడిపై దాడి, ఏం జరిగిందంటే?

Ramagundam News: సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారా ? అయితే ఇది చూడండి!

Ramagundam News: సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారా ? అయితే ఇది చూడండి!

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Karimnagar: గ్రామపంచాయతీల్లో నిధుల గోల్ మాల్- ఆడిటింగ్ లో బయటపడుతున్న అక్రమాలు

Karimnagar: గ్రామపంచాయతీల్లో నిధుల గోల్ మాల్- ఆడిటింగ్ లో బయటపడుతున్న అక్రమాలు

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!