Leopard in Sircilla: చిరుతపులి వరుస దాడులతో హడలిపోతున్న ప్రజలు - అధికారుల సలహా వింటే షాక్ !
Leopard Rajanna Sircilla District: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం రేపుతోంది. వరుసగా ఆవులు, గేదెలపై దాడి చేసి వాటిని చంపుతోంది. తమను కూడా చంపుతుందేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
![Leopard in Sircilla: చిరుతపులి వరుస దాడులతో హడలిపోతున్న ప్రజలు - అధికారుల సలహా వింటే షాక్ ! Leopard kills calf creating panic among locals in Rajanna Sircilla district Leopard in Sircilla: చిరుతపులి వరుస దాడులతో హడలిపోతున్న ప్రజలు - అధికారుల సలహా వింటే షాక్ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/05/1f7a7c3537635f2cba86ee8c4f003def_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
చిరుత సంచారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతోంది. పదిరోజుల వ్యవధిలోనే మరో చిరుత వరుస దాడులు చేసింది. తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలలో చిరుత
సంచారం రైతులతో పాటు గ్రామస్తులలో కూడా భయాందోళనకు గురి చేసింది. పది రోజుల క్రితం వేణుగోపాల్పూర్‌లో గేదె, రెండు దూడలను చంపిన చిరుత నిన్న రాత్రి గండిలచ్చపేట గ్రామంలోకి ప్రవేశించి పొలిమేరల్లో ఉన్న గంగ నర్సయ్య అనే రైతుకు చెందిన గేదెపై దాడి చేసి చంపింది.
రైతు తన గేదెను పొలం దగ్గర కట్టేసి రాత్రి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం వెళ్ళి చూడగా అది మృత్యువాత పడి ఉంది. అక్కడి పరిసరాల్లోని కాలి అడుగుల గుర్తులను బట్టి చిరుత పులి దాడి చేసినట్లుగా స్థానికులు నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ.. గ్రామ రైతులు తమ పశువులను మొదటి నుండి పొలాలు వద్దే కట్టేసుకుంటారని, గతంలో ఎన్నడూలేని విధంగా చిరుత దాడి చేసిందని వాపోయారు. గ్రామ శివారులో చిరుత సంచరించి, వరుస దాడులు చేస్తూ గేదెలను మరియు దూడలను చంపడంతో రైతులు మరియు గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నామన్నారు.
గుంపులు గుంపులుగా వెళ్లండి.. అటవీ శాఖ అధికారులు...
మరోవైపు ఫారెస్ట్ అధికారులు సైతం సమీప గ్రామాల ప్రజలను హెచ్చరిస్తున్నారు.. తునికాకు ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవి లోపలికి ప్రజలు వెళ్లకూడదని.. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గుంపులుగా మాత్రమే కలిసి వెళ్లాలని సూచించారు. అయితే ఇప్పటి వరకూ మనుషులపై దాడి చేయని చిరుతపులి ప్రధానంగా ఆకలి తీర్చుకోవడానికి మూగజీవాల పైన అర్ధరాత్రి వేళల్లో తరచూ దాడులు చేస్తోంది. సంఖ్యాపరంగా చూస్తే ఇది ఒకటేనా లేదా ఈమధ్య ఏమైనా వాటి సంఖ్య పెరిగిందా ? అనే విషయంపై అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు
నిజానికి గుట్టలను ప్రధాన ఆవాసంగా చేసుకుని తిరుగుతున్న చిరుతపులి ఒకసారి సమీప గ్రామాల పై దాడి చేయడం మొదలుపెట్టింది అంటే ఇక తేలికగా దొరికే ఆహారం కోసం అది అలవాటు పడుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పెద్దగా ప్రతిఘటించలేని ఆవులు గేదెలు, మేకలు లాంటి జంతువులను టార్గెట్ చేసుకుంటుంది. మరోవైపు ఇప్పటికైనా అధికారులు స్పందించి మనుషులపై దాడి చేసే పరిస్థితి రాకముందే వెంటనే చిరుతపులిని పట్టుకోవాలని సమీప గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా వేసవి కాలం ముగిసే రోజుల్లో ఉపాధి కోసం అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్ళే తమకు జీవనోపాధి లేకుండా పోతుందని కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని విన్నవించుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)