Rains in Karimnagar: కరీంనగర్ లో మళ్లీ వర్షాలు.. కన్నీరుమున్నీరవుతున్న అన్నదాతలు!
Rains in Karimnagar: ఇటీవల వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పాడైన ఇళ్లే ఇప్పటికీ బాగవ్వలేవు. అంతలోనే మళ్లీ వర్షాలు మొదలై కరీంనగర్ జిల్లా ప్రజలను ఉక్కరిబిక్కిరి చేస్తున్నాయి.
Rains in Karimnagar: కరీంగనర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు కురిసిన వర్షాల ధాటికే ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఇళ్లు, వేలాది ఎకరాల పంటతో పాటు రోడ్లు పూర్తిగా నాశనం అయ్యాయి. వాటి నుంచి జనాలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఇంతలోనే వరుణ దేవుడు మరోసారి మోఘామృతమై ప్రజలను భయపెడుతున్నాడు. రోడ్లు తెగిపోవడంతో ఇప్పిటకీ సరైన కనెక్టివిటీ లేక నానా ఇబ్బందులు పడిపోతున్నారు. నాట్లు వేసిన రైతులకు పనికి రాకుండా పోయిన పొలాలు దర్శనమిస్తున్నాయి.
రోడ్లు తెగిపోయి.. నానా అవస్థలు
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కారణంగా అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కౌలుకు తీసుకొని ముందస్తుగా నాటిన రైతులు ఈ సారి మొదట్లోనే లక్షలు నష్టపోయారు. తొలకరి జల్లు సంబరాలు జరుపుకోవాలని అనుకున్న రైతులకు వరుణ దేవుడు పట్టు పట్టినట్టుగా వారం రోజుల పాటు వర్షాలు కురవడంతో పొలాలన్నీ నామ రూపాలు లేకుండా ధ్వంసం అయ్యాయి. ఇక వర్షం తరువాత ఉన్న బురద ని తొలగించాలంటే కనీసం ఆరునెలల సమయం పడుతుంది లేదంటే రెండు పంటలు నష్టం జరుగుతుంది.
వేల ఎకరాల పంట నీటి పాలు..
నాలుగు జిల్లాల పరిధిలో దాదాపు వేల ఎకరాల్లో పంట వర్షానికి నీట మునిగింది. జగిత్యాల సిరిసిల్లలో ఈ బెడద ఎక్కువగా ఉంది. పెద్దపల్లి జిల్లాలోని 126 గ్రామాల పరిధిలో పొలాలు నీటితో తడిసిపోయాయి. 659 ఎకరాల్లో ఇటీవలే నాట్లు వేయడం తో అవి కొట్టుకుపోయాయి. 4704 ఎకరాల్లో వేసిన పత్తి పంట పూర్తిగా నాశనమైంది. కేవలం కొత్త కరీంనగర్ జిల్లాలో ఆరు వేల ఎకరాల వరకు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు అధికారులు. ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది . జగిత్యాల జిల్లాలోని 22972 ఎకరాల్లో నష్టం ఉండొచ్చని అధికారులు అంచనా... ఇప్పటికే ముందస్తు తొలకరి ఆశలతో సంతోషపడి వ్యవసాయం మొదలు పెట్టిన రైతులకు ఈసారి కన్నీరే మిగిలింది.
ప్రాణంగా పెంచిన పశువులు దూరం..
ఇక చేతి వృత్తి దారుల సమస్యలు వేరే రకంగా ఉంది. కనెక్టివిటీ తెగిపోవడంతో కుల వృత్తిని చేసుకోలేక పోతున్నామని కల్లుగీత కార్మికులు అంటున్నారు. వరద నీరు ఎప్పుడు పోతుందో తెలియక తమ వృత్తికి ఆటంకాలు ఎదురవుతున్నాయి అని... అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసం తాము బయటకు రావాల్సి ఉందని వారు వాపోతున్నారు. మళ్లీ ఇలాగే వర్షాలు కురిస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని వివరిస్తున్నారు. అలాగే ప్రాణంగా పెంచుకున్న పశువులు ప్రాణాలు కోల్పోయి.. తమకు లేనిపోని నష్టాన్ని మిగిల్చాయని ఆవేదన చెందుతున్నారు. ఇది వరకు కురిసిన వర్షాల కారణంగానే చాలా నష్టపోయామని.. మరోసారి వరుణుడు మాపై పట్టుబడినట్లుగా చేస్తున్నాడని వాపోయారు. ఈసారి మళ్లీ వర్షాలు కురిస్తే ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అంటున్నారు. అలాగే ఇప్పటి వరకూ నష్టపోయిన వాటికి ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని కోరుతున్నారు.