MLC Elections: 40 అసెంబ్లీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీ సీటు, పట్టభద్రుల ఎన్నికలకు ఊహించనంత పోటీ
Telangana MLC Elections | తెలంగాణలో త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి మద్దతుతో విజయం సాధించాలని పలువురు భావిస్తున్నారు.
Telangana Graduate MLC Elections | మరికొన్ని రోజుల్లో తెలంగాణలో జరగనున్న మరో ఎన్నిక ఆసక్తి రేపుతోంది. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కోసం ఆశావాహులు సిద్ధమవుతున్నారు. అయితే టికెట్ కోసం ఆయా పార్టీ నేతల మధ్య పోటీ నెలకొంది. ప్రధాన పార్టీలకు కూడా ఈ ఎన్నికలు విలువైనవి. పార్టీ అభ్యర్థులకు మధ్య పోటీ ఎలా ఉండబోతుంది. టికెట్ దక్కేది ఎవరికి? బరిలో నిలిచేది ఎవరు రసవత్తరంగా మారుతున్న కరీంనగర్ - ఆదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ లో పరిస్థితి ఇలా ఉండబోతుంది.
40 అసెంబ్లీ స్థానాలకు ఒక్క ఎమ్మెల్సీ సీటు
తెలంగాణలో మరో పట్టభద్రుల ఎన్నికల పోరు జరగనుండగా, ప్రధాన పార్టీ నేతలు టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ సీటు నిలుపుకోవాలని కాంగ్రెస్, సత్తా చాటాలని టిఆర్ఎస్ నాలుగు ఉమ్మడి జిల్లాలు 40 కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఒకే ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. పార్టీల ఆశావహులు అందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ గ్రాడ్యుయేట్ ఎన్నికల నోటిఫికేషన్ కు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే ప్రచారం మొదలుపెట్టి కొందరు ప్రచార జోరును పెంచారు. తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలంటూ విద్యావంతుల మద్దతు కోరుతున్నారు ఓవైపు పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి సామాన్యులు కూడా పోటీకి దిగాలనుకోవడం ఆసక్తి రేపుతోంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేని వారు కూడా ఎన్నికలపై ఫోకస్ చేయడంతో పొలిటికల్ పార్టీలు వర్సెస్ సామాన్యులుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు జరిగేలా కనిపిస్తోంది.
ఇంతకాలం పార్టీలను అంటి ముట్టనట్టుగా వ్యవహరించిన నేతు కూడా ఎన్నికల్లో పోటీ చేసినందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలో కూడా బలమైన అభ్యర్థులను దింపేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ తిరిగి సిట్టింగ్ సీటుని కైవసం చేసుకోవాలని చూస్తుండగా, బిజెపి కాషాయ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. గతంలో బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న ఈ ఎమ్మెల్సీ సెగ్మెంట్ లో తిరిగి సత్తా చాటాలని కారు పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో సామాన్యులు కూడా లక్ పరీక్షించుకోవాలని తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్‌లో పెరిగిన పోటీ
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో స్వామి గౌడ్ విజయం సాధించగా.. 2019 మార్చ్ లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున వెలిచాల రాజేందర్ రావు, మేనేని రోహితరావు, ప్రణవ్ బాబు, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
అయితే నరేందర్ రెడ్డి మాత్రం పార్టీ టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా వారు సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి మరోసారి పట్టభద్రులు ఎన్నికలకు పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి యాదగిరి శేఖర్ రావుకు టికెట్టు వస్తుందన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. అదే పార్టీకి చెందిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూడా పోటీలో ఉంటానన్నారు.
బీజేపీ నుంచి బరిలో నిలిచేది ఎవరో..
బిజెపి నుంచి పొలసాని సుగుణాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాణి రుద్రమ, జగిత్యాల జిల్లా నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ ఆశించేవారు ఇప్పటికే అధిష్టానాలను కలిసి తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక గతంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్ బి.ఎన్ రావు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏది ఏమైనాప్పటికీ ఒక పార్టీ నుంచి పార్టీ టికెట్ ఒక్కరికి వస్తుంది కనుక టికెట్లు రానివారు రెబల్ గా బరిలోకి దిగుతారా అనేది తేలాల్సి ఉంది.