Gouravelli Project: ఉద్రిక్తంగా హుస్నాబాద్ బంద్, బండి సంజయ్ ఎంట్రీతో గవర్నర్ వద్దకు పంచాయతీ!
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన నిర్వాసితులకు అక్కడికి చేరుకున్న స్థానిక టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది
Siddipet District: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో ఆదివారం నుండి వరుసగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో భారీ ఎత్తున చేరుకున్న పోలీసు బలగాలు భూనిర్వాసితులపై లాఠీఛార్జ్ చేశాయి. దీనికి నిరసనగా నిర్వాసితులు అంతా కలిసి హుస్నాబాద్ బంద్ కి పిలుపు ఇచ్చారు. దీంతో భారీ ఎత్తున చేరుకుంటున్న భూ నిర్వాసితులను ఎక్కడికక్కడ పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నిరసన కారులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. కొందరు నిరసనకారులు గాయాలపాలవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఎక్కడిక్కడ అరెస్టులు చేసినా పలువురు హుస్నాబాద్ చేరుకోగలిగారు. వీరంతా కలిసి ఎమ్మెల్యే ఒడితేల సతీష్ కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి బయల్దేరి వెళ్లారు.
మరోవైపు, కొంతమంది నిరసనకారులు హుస్నాబాద్ సీఐ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లడంతో మరింత పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన నిర్వాసితులకు అక్కడికి చేరుకున్న స్థానిక టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ సమయంలోనే ఏసీపీకి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఎస్ఐ శ్రీధర్ కూడా స్వల్పంగా గాయపడ్డారు.
పోలీసుల లాఠీచార్జిలో ఒక మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక హుస్నాబాద్ హన్మకొండ రహదారిని దిగ్బంధించి అక్కడ వంటావార్పు మొదలుపెట్టారు నిరసనకారులు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ వచ్చి తమ గోడు వినేవరకు వరకూ తాము వదిలేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు పరిష్కారం చేసే అవకాశం ఉన్నా కావాలనే అటు అధికారులు ఇటు నాయకులు దీనిని తాత్సారం చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నా ఎందుకు లాఠీఛార్జి చేశారు అంటూ పోలీసులపై తిరగబడ్డారు.
బాధితులకు బండి సంజయ్ పరామర్శ
లాఠీఛార్జి నిరసిస్తూ పలు పార్టీల నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు నిరసనకారులకు మద్దతు తెలపగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రంగంలోకి దిగారు. నిన్న రాత్రి 11 గంటలకు భూనిర్వాసితులను పరామర్శించిన బండి సంజయ్ అక్కడి పరిస్థితిని హైదరాబాదులో ఉన్న గవర్నర్ కు వివరించేలా ప్లాన్ చేశారు. నిర్వాసితులలో కొందరిని గవర్నర్‌తో కలిపించి అక్కడ పోలీసులు చేసిన దమనకాండను వివరించాలని సూచించారు. పార్టీ పరంగా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి పార్టీ నుండి లీగల్ సెల్, డాక్టర్ సెల్ బృందాలను క్షేత్రస్థాయికి వెళ్లి సహాయంగా నిలవాలని ఆదేశించారు. దీంతో ఇప్పటివరకు కేవలం హుస్నాబాద్, సిద్దిపేటకే పరిమితమైన నిర్వాసితుల నిరసన ఇక హైదరాబాద్‌కు చేరుకోనుంది.