కరీంనగర్‌లో కారా? బండా? దేని జోరు ఎంత ?
రవీందర్ సింగ్ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం గంగులకి వ్యతిరేకంగా పనిచేయడం బహిరంగ రహస్యమే.. ఇంత జరుగుతున్న అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గంగుల అనుచరులకు మింగుడు పడడం లేదు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గత ఎన్నికలతో పోలిస్తే అధికార పార్టీ బలాబలాలు చాలా మారిపోయాయి. గతంలో ఏమాత్రం ఆలోచించకుండా సీటు పక్కాగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి దక్కించుకుంటుందని అంచనాలు ఉండేవి. దానికి అనుగుణంగానే ఫలితాలు కూడా వచ్చేవి. కానీ గత కొద్ది కాలంగా మారుతున్న పరిస్థితులు రానున్న ఎన్నికల వరకు టిఆర్ఎస్ కి కంచుకోటలా మారిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి గట్టి పోటీ తప్పదని అంచనాలకు తావిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కేంద్రంలో ఉన్న బిజెపి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని అధికార పార్టీకి కంచుకోటలా మారిన కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. మరోవైపు టిఆర్ఎస్‌లోనూ వరుసగా జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీలో బలహీనతలను బయటపెడుతున్నాయి ఒకవైపు బలమైన బీసీ నేతగా ..హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఘనత సాధించిన ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ రానున్న ఎన్నికల వరకు గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తనపై మాజీ మేయర్ రవీందర్ సింగ్‌తోబాటు మరికొందరు టిఆర్ఎస్ కార్పొరేటర్లు తిరుగుబాటు జెండా ఎగరేయడమే కాకుండా సొంత పార్టీలో ఉన్నప్పటికీ అడుగడుగునా అడ్డంకులు ఏర్పరుస్తున్నారు.
ఒకానొక సమయంలో మంత్రిని బద్నాం చేయడానికి సదరు మాజీ మేయర్ అల్లుడు కుట్రపన్నాడంటూ గంగుల వర్గీయులు ఆడియో టేప్ కూడా విడుదల చేశారు. ఇంత జరుగుతున్నా రవీందర్ సింగ్‌ని సస్పెండ్ చేయడంపై గంగులకు అధిష్ఠానం ఎలాంటి హామీ ఇవ్వలేదు. పైగా ఉత్తర భారత దేశ పర్యటనలకు వెళుతున్న సీఎం కేసీఆర్ ప్రతిసారి తనతోపాటు రవీందర్ సింగ్‌ని ప్రత్యేకంగా తీసుకెళ్తున్నారు. ఢిల్లీ, పంజాబ్‌లోను గణనీయమైన సంఖ్యలో ఉన్న సిక్కు నాయకులను కమ్యూనికేట్ చేయాలంటే అదే వర్గానికి చెందిన రవీందర్ సింగ్ సైతం వెంట ఉంచుకోవాల్సిందేనని సీఎం ఆశిస్తున్నారు.
కానీ ఈ పరిణామాలు గ్రౌండ్ లెవెల్‌లో గంగులకి మాత్రం ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఓవైపు రవీందర్ సింగ్‌ని కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ ఆమె భర్త సోహన్ సింగ్‌ను బహిష్కరించాలంటూ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పెద్దగా స్పందించలేదు.
మైనార్టీ నేతగా పేరు ఉన్న రవీందర్ సింగ్ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం గంగులకి వ్యతిరేకంగా పనిచేయడం బహిరంగ రహస్యమే.. ఇంత జరుగుతున్న అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గంగుల అనుచరులకు మింగుడు పడడం లేదు.
స్థానికంగా ఉంటూనే గంగుల దాదాపు తన నియోజకవర్గంలోని లోకల్ లీడర్లతో మంచి సంబంధాలే మైంటైన్ చేస్తున్నారు. బలమైన ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ తోబాటు ప్రజలతో మంచి సంబంధాలే ఉన్న గంగులను ఢీకొట్టడం అంత ఈజీ ఏమీ కాదు. కానీ కరీంనగర్ సీటును చేజ్కి ఉంచుకుంటే తిరుగు ఉండదని బిజెపి భావిస్తోంది. గతంలో గంగులపై పోటీ చేసి ఓడిపోయి ప్రస్తుతం ఎంపీగాను, ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా మారిన బండి సంజయ్‌కి నియోజకవర్గంలోని బలాలు బలహీనతలు చాలా బాగా తెలుసు. దీంతో కరీంనగర్ సీటుని గెలిపించుకొని తనపై కేంద్రంలోని పెద్దలు ఉంచిన నమ్మకాన్ని నిజం చేసుకోవాలని బండి సంజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి మంచి పేరున నేతను ఎన్నికల సమయం వరకు ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలో కరీంనగర్ అంటేనే కాంగ్రెస్ అన్నట్లుగా ఉండేది. అలాంటి ఆ పార్టీ ప్రస్తుతానికి కొంతవరకు పోటీలో వెనుకంజ వేసింది. నాయకులకు కొదవలేదు గాని ప్రజల్లోనే పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను అధిగమించడానికి ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొత్తంగా చూస్తే గతంలో కంటే ఈసారి టిఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ స్థానాన్ని గెలవడం అంత ఈజీ కాదని చెప్పవచ్చు.