Karimnagar: కాంబోడియా ఫేక్ జాబ్ కేసులో కొత్తకోణం, విచారణలో షాకింగ్ విషయాలు
Karimnagar Youth trapped in Cambodia: కాంబోడియా, మయన్మార్ లాంటి దేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ పలువురు సైబర్ మోసగాళ్లు సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తుండడంతో నిరుద్యోగులు వాటి వైపు ఆకర్షితులవుతున్నారు.
Karimnagar Youth trapped in Cambodia: దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో బాధితులు
ఇప్పటికే దాదాపు 200 మందిని కాపాడామని వెల్లడించిన విదేశాంగ శాఖ
లోన్ యాప్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మరో సైబర్ క్రైమ్ పోలీసులను కలవరపెడుతోంది. కాంబోడియా, మయన్మార్ లాంటి దేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ ఈమధ్య పలువురు సైబర్ మోసగాళ్లు సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తుండడంతో నిరుద్యోగులు వాటి వైపు ఆకర్షితులవుతున్నారు. అలా ఈ మధ్య కాంబోడియా సైబర్ గ్యాంగ్ కి కరీంనగర్ కి చెందిన కొందరు యువకులు చిక్కుకొని ఆదేశంలో బానిసల్లా బతకాల్సి వస్తోంది. డబ్బులు పోవడం ఒక్కటే కాదు... చివరికి తమని అమ్మేశారంటూ బాధితులు వీడియో విడుదల చేయడంతో కరీంనగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణను కలిసిన బాధితుల తల్లిదండ్రులు పూర్తి వివరాలు అందించడంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఆ యువకులను తిరిగి స్వస్థలానికి చేర్చడానికి కృషి చేస్తున్నాయి. అయితే భారత విదేశాంగ శాఖ దీనికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ఇప్పుడు అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇది కూడా లోన్ ఆప్ ల మాదిరిగా కొద్ది కాలం పాటు ఇక్కడ యువకుల్ని మోసం చేయడానికి వేసిన స్కెచ్ అని భావిస్తున్నారు. ఇందులో కూడా ప్రధాన నిర్వాహకులు చైనీయులే ఉన్నారని గుర్తించారు.
అసలేం జరిగింది?
ఉద్యోగావకాశాల పేరుతో ఓ కన్సల్టెంట్ నిర్వాహకుడు చేసిన మోసానికి కొంతమంది యువకులు సైబర్ క్రైమ్ గ్యాంగ్ చేతిలో బందీ అయ్యారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించిన సదరు ఏజెన్సీ నిర్వాహకులు వీరి దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసి కంబోడియా కి పంపించారు. అయితే అక్కడ జరుగుతున్న కథ వేరే ఉంది అనేక రకాల ఇల్లీగల్ పనులు చేయిస్తూ బెదిరిస్తున్నారని... లేదంటే పాస్ పోర్ట్‌లు స్వాధీనం చేసుకొని జైల్లో పెట్టిస్తామని టార్చర్ పెడుతున్నారంటూ ఓ వీడియో విడుదల చేశారు. తమని కాపాడాలని... 3 వేల డాలర్లు చెల్లిస్తే వదిలేస్తామని సదరు సైబర్ గ్యాంగ్ డిమాండ్ చేస్తుందని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు.
టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగడంతో సమస్యకు పరిష్కారం
బాధిత కుటుంబాలకు చెందిన వారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ కలిసి తమ పిల్లలను వెనక్కి రప్పించాలని కోరారు దీంతో ప్రత్యేక టాస్కో ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసిన కమిషనర్ తో నకిలీ కన్సల్టెన్సీ నిర్వాహకులను పిలిపించి హెచ్చరించారు. అంతేకాకుండా ఆ యువకులను ఎవరికి అప్పగించారు, వారి వివరాలు సైతం సేకరించింది టాస్క్ ఫోర్స్ టీమ్. మరోవైపు విదేశాంగ శాఖకి సమాచారం అందించడంతో కొందరు యువకులని తిరిగి కరీంనగర్ కి రప్పించగలిగారు.
ఎందుకిలా?
ఇక్కడి నుండి దుబాయ్ ఇతర దేశాలకు ఉపాధి కొరకు పలువురు వెళ్తుంటారు. ఇదే అవకాశంగా తీసుకొని కొందరు కన్సల్టెన్సీ నిర్వాహకులు నిరుద్యోగ యువతను నిలువునా ముంచేస్తున్నారు. అటు డబ్బులు పోయి ఇటు జీవితం కోల్పోయి జీవచ్ఛవాలుగా బతికే పరిస్థితి నెలకొంది. సరైన నిఘా లేకపోవడమే దీనంతటికీ కారణం అని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ప్రజలు మోసగాళ్లను సులువుగా నమ్మడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే ప్రస్తుతం విదేశాంగ శాఖ ఆయా దేశాల్లో ఉన్న భారత ఎంబసీలను అప్రమత్తం చేయడంతో వివరాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. ఎవరైనా విదేశాల్లో చిక్కుకొనిపోయి ఉంటే వివరాలు అందించాలని ప్రజలకు సూచించారు.