BRS MLA KTR: నిరాశ చెందవద్దు, బీఆర్ఎస్ కు త్వరలోనే మంచిరోజులు: కేటీఆర్
BRS MLA KTR visits Sircilla: మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు వెళ్లారు. తనను 30 వేల మెజారిటీతో గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Sircilla BRS MLA KTR: సిరిసిల్ల: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత తొలిసారి మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల (KTR Visits Sircilla)కు వెళ్లారు. తనను 30 వేల మెజారిటీతో గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్లలో ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు ఏకైక గొంతు పార్టీ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్.. ఆ రెండింటిని ప్రజలు వదులుకోరు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం సహజం అన్నారు. అయితే తాజా ఎన్నికల ఫలితాలతో నిరాశ పడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి అని, పోరాటాలు రాష్ట్ర ప్రజలకేం కొత్త కాదని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో వారి తరపున మాట్లాడుతాం అని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో తనను గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇతర పార్టీల నేతలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా తనకు, పార్టీకి ఇక్కడి ప్రజలు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. గత 100 రోజులుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ కోసం పని చేసిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు రావడం సహజమేనన్నారు. అప్పుడు టీఆర్ఎస్.. ఇప్పుడు బీఆర్ఎస్ కు కొట్టాడటం కొత్త కాదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. గత మూడు రోజులుగా తమకు ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని, అయ్యో కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరా, బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా అని కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు కూడా అంటున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో అధికారం రావడం, కోల్పోవడం కొత్త కాదని, దీని నుంచి నిరాశ చెందవద్దని సూచించారు. ప్రజలు తమకు 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారని, రెండుసార్లు అధికారం ఇచ్చినందుకు ప్రజలకు రుణపడి ఉంటాం. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండి కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం చేస్తాం. తెలంగాణకు ఉన్న గొంతు కేసీఆర్, బీఆర్ఎస్ అని.. ప్రస్తుత ఫలితాలు కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటిదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలయ్యేలా పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు.
తెలంగాణకు ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్.. ఆ రెండింటిని ప్రజలు వదులుకోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS స్పష్టం చేశారు.
— BRS Party (@BRSparty) December 6, 2023
సిరిసిల్లలో ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు.
తనను 30 వేల మెజారిటీతో గెలిపించిన… pic.twitter.com/TZuxANf7ss
వేములవాడలో స్వల్ప మెజార్టీతో సీటును కోల్పోయాం, కానీ కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఓటుకు డబ్బులు ఇవ్వను, మందు పంచనని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా సిరిసిల్ల అభివృద్ధి కొనసాగుతుందని నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. సిరిసిల్లకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరేలా చేస్తామన్నారు.
Also Read: తెలంగాణలో ప్రతిపక్ష నేత ఎవరు? కేటీఆర్, హరీష్ కాదు, అనూహ్యంగా కొత్త పేరు!