BJP on Rasamai Balakishan: "సెస్ ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచిన రసమయిది ఓ గెలుపేనా"
BJP on Rasamai Balakishan: పనిచేయని ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ మాకు వద్దని ప్రజలు తరిమికొడుతున్నారని బీజేపీ నేత గంగాడి కృష్ణారెడ్డి అన్నారు.
![BJP on Rasamai Balakishan: BJP Leaders Fires on Manukonduru MLA Rasamai Balakishan BJP on Rasamai Balakishan:](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/28cf8ada3b32c0ae4cf576e543a0eea21672407541683519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BJP on Rasamai Balakishan: మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు నియోజకవర్గంలో విలువ లేదని, అందుకే నియోజకవర్గ ప్రజలు రసమయి ఎక్కడికి వెళ్లినా తరిమి కొడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఘాటుగా విమర్శించారు. ఇలాంటి ఎమ్మెల్యే రసమయికి.. ఎంపీ బండి సంజయ్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. బుధవారం మానకొండూరు నియోజకవర్గ బీజేపీ మండల మోర్చా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. అంతకు ముందు విలేకరుల సమావేశంలో కూడా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన సెస్ ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచిన బీఆర్ఎస్ కు బీజేపీ శక్తి ఏంటో అర్థమయిందన్నారు. అయినప్పటికీ ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మేకపోతు గాంబిర్యాలు ప్రదర్శిస్తూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్రంలోని రైతు సమస్యలను గాలికి వదిలేసి, రైతుల కోసమే బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయల రుణమాఫీని ఏక కాలంలో మాఫీ చేయడం చేతగాని ప్రభుత్వం.. కేసీఆర్ ప్రభుత్వమని ఆరోపించారు. ధరణి పోర్టల్ ను తీసుకు వచ్చి రైతులను అష్ట కష్టాల పాలు చేశారని, పంట కొనుగోలను సక్రమంగా చేయకుండా, గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను నష్ట పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని మాట్లాడితే మంచిదని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. రెండు దఫాలుగా మానకొండూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రసమయి నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేసి, రాజకీయ వ్యాఖ్యలు చేయడానీకే పరిమితమయ్యారని విమర్శించారు.
రసమయి బాలకిషన్ కు దమ్ము ధైర్యం ఉంటే తొమ్మిదేళ్లలో మానకొండూరు నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటో గ్రామాల వారీగా తెలుపుతూ శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం అన్నారం - మానకొండూరు మధ్య ఐదు కిలోమీటర్ల రోడ్డు కూడా వేయించలేని స్థితిలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉన్నారని అన్నారు. ఎంపీ బండి సంజయ్ జగిత్యాల-కరీంనగర్-వరంగల్ లకు నాలుగు వరసల రహదారి కోసం ఎన్ హెచ్ 563 కోసం దాదాపు 4600 కోట్ల నిధులు మంజూరు చేయించారని, ఈ రహదారి కూడా మానకొండూరు మండల కేంద్రం, శంకరపట్నం మండల కేంద్రాల మీదుగా వెళ్తుందని తెలిపారు. ఈ విషయం గుర్తు పెట్టుకొని మాట్లాడితే మంచిదని సూచించారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్న ఘనత బండి సంజయ్ ది అయితే.. కుటుంబ రాజకీయాలు చేసేది సీఎం కేసీఆర్ అని ఆరోపించారు.
మానకొండూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో, మండలాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరిగిందని, ఎంపీ బండి సంజయ్ కుమార్ తన నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువలు, వీధి దీపాలు కోసం నిధులు మంజూరు చేయించారని గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు అండగా నిలిచారని, దాతృత్వంతో వైద్య పరికరాలు ఉచితంగా మానకొండూర్ ఆరోగ్య కేంద్రానికి పంపిణీ చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ గుండ్లపల్లి - పొత్తూర్ వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపితే.. కేసీఆర్ ప్రభుత్వం ఆమోదం తెలుపలేదని అన్నారు. ఎందుకు ఆమోదం తెలుపలేదో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమాధానం చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మానకొండూరు నియోజకవర్గంలో బీజేపీ శక్తి ఏంటో రాబోయే ఎన్నికల్లో తెలుస్తుందని, ఆలోపు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని.. లేకపోతే ప్రజలే రసమయికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)