Bandi Sanjay: రాజకీయ జోక్యం పెరిగితే కుల సంఘాలు చీలిపోతాయి - కేంద్ర మంత్రి బండి సంజయ్
Telangana News | కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రముఖ ఆలయాలను అభివృద్ది చేయడానికి కృషి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కరీంనగర్: వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్లాన్ ప్రకారం ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కరీంనగర్ ఎంపీగా గెలవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనకు సహకరించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను అభివృద్ధి చేసి తీరుతానని బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ఆయా ఆలయాల అభివృద్ధిపై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసి మాట్లాడినట్లు చెప్పారు. అవసరమైతే కేంద్ర మంత్రిని సైతం ఎములాడకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. తాను అన్ని కుల సంఘాలకు నిధిలిచ్చానని, దయచేసి రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులను కుల సంఘాల బాధ్యతలు అప్పగించాలన్నారు. పొరపాటున పార్టీలు ఇందులో జొరబడితే కుల సంఘాలు చీలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందరి సహకారంతో కుల సంఘాలు అభివృద్ధి కావాలన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దక్షిణకాశీ వేములవాడకు విచ్చేసిన సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని అన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనపై ఇంకా పెరిగిందన్నారు. ఎములాడ రాజన్న ఆలయంతోపాటు కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాల అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నానని బండి సంజయ్ తెలిపారు. వేములవాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంగళవారం పట్టణంలో మున్నూరుకాపు సంఘం భవన నిర్మాణం భూమి పూజలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ... జై శ్రీరామ్ అనేటోల్లు నిజమైన మున్నూరు కాపులు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేసిందుకు సంతోషంగా ఉంది. సంఘ భవన నిర్మాణం కోసం తన వంతు పూర్తి సహకారం అందిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అంతా కష్టపడి పనిచేసినందుకే గెలిచి మంత్రిని అయ్యానని చెప్పారు. తన గెలుపునకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సహకరించారంటూ ట్విస్ట్ ఇచ్చారు. తనకు భారీ మెజారిటీ ఇచ్చి, గెలిపించిన వేములవాడ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తా అన్నారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో పనిచేస్తానని బండి సంజయ్ చెప్పారు.