Bandi Sanjay Rythu Deeksha : ఎకరానికి రూ. 25వేల పరిహారం ఇవ్వాల్సిందే - బండి సంజయ్ డిమాండ్ - కరీంనగర్‌లో రైతు దీక్ష
Telangana News : కరువుతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పాతిక వేల పరిహారం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో బండి సంజయ్ రైతు దీక్ష చేశారు.
Bandi Sanjay Rythu Deeksha In Karimnagar : కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ లో ఆయన రైతు దీక్ష చేపట్టారు. వంద రోజుల్లో రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తానన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు…రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని, పంట నష్టపోయిన రైతులకు పరిహారంలో జాప్యమెందుకని నిలదీశారు.
కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టడంతో రైతులకు భరోసా ఇచ్చేందుకే ‘రైతు దీక్ష’’ చేపట్టినట్లు చెప్పారు. కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో రైతులతో కలిసి బండి సంజయ్ ‘రైతు దీక్ష’ కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన రైతులు మోసపోయారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చేతులెత్తేసిందన్నారు.కోట్లాది రూపాయల ప్రకటనలతో 6 గ్యారంటీలను అమలు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదు?. రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదు?. వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ ఏమైంది? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
Started off the 'Rythu Deeksha' in Karimnagar alongside farmers, demanding justice & fulfillment of promises made by the Congress Government which include:
— Bandi Sanjay Kumar (Modi Ka Parivar) (@bandisanjay_bjp) April 2, 2024
🌾 Providing ₹15,000 per acre
🌾 ₹2 lakh loan waiver
🌾 ₹25,000 crop loss compensation per acre
Despite being in… pic.twitter.com/LcH3AXD2WD
వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనయ్ వెంటనే బోనస్ ప్రకటించాలన్నారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు తీసుకురాలేదు?. అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంట నీళ్లపాలైందన్నారు. అకాల వర్షాలకు రాలిపోయిన మామిడి పిందెలను, రాలిన వడ్ల కంకులను మీడియాకు చూపిస్తూ. సాగునీరు లేక పంట ఎండిపోయి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? అని ఆవేధన వ్యక్తం చేశారు.
ఎకరాకు రూ.10 వేల సాయం ప్రకటించిన ప్రభుత్వం ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందని, రైతులు కష్టాల్లో ఉన్నారని, రూ.10 వేల సాయం సరిపోదన్నారు. తక్షణమే ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని,అట్లాగే రైతు భరోసా పేరుతో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు చెల్లించాల్సిందేనన్నారు. రైతు కూలీలకు సైతం ఏటా రూ.12 వేల ఇవ్వాల్సిందే. కేంద్రం ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయరు… పంటల బీమాను అమలు చేయరు.. రైతులెలా బతకాలన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా తక్షణమే వడ్ల కొనుగోలు చేయాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.
వడ్ల కల్లాల వద్ద బస చేసి.. రైతులు పడుతున్న బాధలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు తన దీక్షకు సంఘీభావం తెలపాలని కోరారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, 2-3 రోజుల్లో ప్రణాళికను వెల్లడిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.