Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్
Bandi Sanjay : టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఒక సాకుతో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని చూస్తుందని బండి సంజయ్ ఆరోపించారు.
Bandi Sanjay : ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించాలనుకున్నామని, కానీ పూజలు చేసుకునే అవకాశం కూడా పోలీసులు ఇవ్వడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ముందు సభ నిర్వహించుకోడానికి అనుమతి ఇచ్చి ఆ తరువాత కుంటి సాకులతో అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహించామన్నారు. ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్దంగా పాదయాత్రను కొనసాగించామన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించిందన్నారు. అందుకే హైకోర్టుకు వెళ్లామన్నారు. పాదయాత్రకు అనుమతి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.
భైంసా తెలంగాణలో లేదా?
"కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తాం. ఈరోజే నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వెళుతున్నా. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తాం. అక్కడి నుంచే లాంఛనంగా పాదయాత్రను ప్రారంభిస్తాం. భైంసాను బండి సంజయ్ కు దూరం చేశారేమో.. కానీ భైంసా ప్రజల నుంచి బండి సంజయ్ ను దూరం చేయలేరు. ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ నుంచి భైంసా ప్రజలను వేరు చేయలేరు. భైంసాకు అసలు ఎందుకు వెళ్లకూడదు? వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? పర్మిషన్ తీసుకోవాలా? భైంసా ఈ దేశంలో లేదా? అసలు భైంసాలో అల్లర్లు సృష్టించింది ఎవరు? ఆ అల్లర్లలో గాయపడ్డ వారిని ఆదుకున్నదెవరు? భైంసాలో అమయాకుల ఉసురు తీసిందెవరు? కేసులు పెట్టి, పీడీ యాక్ట్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందెవరు? మేం భైంసాలో పాదయాత్ర చేస్తే ఇవన్నీ బయటకొస్తాయనే భయంతోనే అక్కడికి వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేసింది." - బండి సంజయ్
పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు
పాతబస్తీలో పాదయాత్రను ప్రారంభించామని, భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద నుంచి నాలుగో వితడ పాదయాత్ర చేస్తే అల్లర్లు జరిగాయా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రశాంతంగా యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. మజ్లిస్ నేతలు చెప్పినట్లు కేసీఆర్ నడుస్తున్నారన్నారు. కేసీఆర్ ఫ్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసుకుంటామని, వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటామన్నారు.
పాదయాత్రకు హైకోర్టు అనుమతి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేసుకొనేందుకు హైకోర్టు అనుమతించింది. అందుకోసం కొన్ని షరతులు విధించింది. అయితే, యాత్ర భైంసా పట్టణం నుంచి వెళ్లకూడదని, అవసరమైతే భైంసాకు మూడు కిలో మీటర్ల దూరంలో సభ జరుపుకోవచ్చని సూచించింది. నిర్మల్ మీదుగా పాదయాత్ర వెళ్లాలని సూచించింది. శాంతి భద్రతలను పూర్తిగా పోలీసులే కాపాడాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో సభ జరుపుకోమని బండి సంజయ్‌కు సూచించిన హైకోర్టు... మరికొన్ని షరతులు విధించింది. ఎలాంటి వివాదాస్పద కామెంట్లు చేయొద్దని సూచించింది. ఇతర మతస్తులను కించపరిచేలా వ్యాఖ్యలు వద్దని ఆదేశించింది. సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు మాత్రమే సభ నిర్వహించాలని తెలిపింది. సభకు మూడు వేల మంది కంటే ఎక్కువ మందిని అనుమతించి వద్దని కూడా వారించింది. కార్యకర్తల చేతిలో ఆయుధాలు, కర్రలను తీసుకెళ్లొద్దని కూడా తెలిపింది. పాదయాత్ర కూడా ఐదువందల మందితో చేయాలని చెప్పింది.