Karimnagar Accident: ఎట్టకేలకు కారు బయటికి.. వెంటనే కుప్పకూలిన రెస్క్యూ ఆఫీసర్, అది చూసి స్థానికుల కంటతడి
కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఎట్టకేలకు బావి నుంచి కారును బయటకు తీశారు. లోపల చిక్కుకొని చనిపోయిన వ్యక్తి సహాయ కార్యక్రమాలు చేపట్టిన అగ్ని మాపక అధికారికి సొంత సోదరుడే కావడం విషాదాన్ని నింపింది.
కరీంనగర్ జిల్లాలో గురువారం (జులై 29) బావిలోకి దూసుకెళ్లిన కారును సుదీర్ఘ ప్రయత్నం తర్వాత అధికారులు బయటకు తీయించారు. అయితే, ఇందులో ఉన్న వ్యక్తి రిటైర్డ్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా గుర్తించారు. ఈయన రెండేళ్ల క్రితం రిటైరయ్యారు. బావిలో పడ్డ కారును వెలికి తీసిన అనంతరం.. అందులోని వ్యక్తిని చూసి ఈ సహాయక కార్యక్రమాలు చేపట్టిన అగ్నిమాపక అధికారి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కారులో చనిపోయిన వ్యక్తి ఆయనకు సోదరుడే కావడంతో మరింత విషాదాన్ని నింపింది. బావిలో పడ్డ ఆ కారును క్రేన్‌తో బయటికి తీయగానే అనుమానం వచ్చిన ఆయన లోపలి వ్యక్తిని చూసి కన్నీరు మున్నీరయ్యారు.
కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరు శివారులోని పంట పొలాల్లో ఉన్న పెద్ద బావిలోకి కారు అదుపు తప్పి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. తొలుత అందులో ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు భావించారు. అయితే, కారును వెలికి తీశాక అందులో రిటైర్డ్ ఎస్సై పాపయ్య నాయక్ అనే 60 ఏళ్ల మాజీ ఉద్యోగి ఉన్నట్లు గుర్తించారు. హన్మకొండ జిల్లా సూర్యానాయక్ తండాకు చెందిన పాపయ్య నాయక్ కరీంనగర్ జిల్లాలో స్థిరపడ్డారు. గురువారం రాజీవ్ రహదారిపై ముల్కనూర్ వైపు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడింది. వెంటనే పాపయ్య నాయక్ బయటికి వచ్చేందుకు ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో ఆయన ఆ బావిలోనే జల సమాధి అయ్యారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. తమ వల్ల కాకపోవడంతో సాయం కోసం అగ్ని మాపకశాఖను ఆశ్రయించారు. జిల్లాలోని మానకొండూరు అగ్నిమాపక శాఖ అధికారిగా ఉన్న భూదయ్య నాయక్ వెంటనే తన సిబ్బందితో అక్కడికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు ఆ బావి 60 అడుగుల లోతు వరకూ ఉండగా క్రేన్ సాయంతో బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పోలీసులు, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 8 నుంచి 9 గంటల సమయం శ్రమించి కారును బయటికి తీశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బావిలో పడ్డ కారును బయటికి తీసేందుకు రాత్రి వరకూ సమయం పట్టింది.
సొంత సోదరుడే..
రాత్రి వేళ ఆ కారును చూసిన అగ్నిమాపకశాఖ అధికారి భూదయ్యలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఆ కారు తన సోదరుడు, రిటైర్డ్ ఎస్సై అయిన పాపయ్య నాయక్‌ది. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి ఎదురుకాకూడదని భావించినా చివరికి అదే జరిగింది. ఆ కారు లోపల తన సోదరుడు పాపయ్య నాయక్ విగత జీవిగా కనిపించారు. తన సొంత అన్న మృతదేహాన్ని చూసి భూదయ్య నాయక్ కుప్పకూలిపోయారు. సోదరుడ్ని కాపాడుకోలేకపోయానని కన్నీరు మున్నీరయ్యారు. అక్కడున్న వారంతా ఈ దృశ్యం చూసి చలించిపోయారు.