Jharkhand MLAs In Hyderabad: హైదరాబాద్‌కు చేరుకున్న ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు, ఎయిర్ పోర్ట్ నుంచి రిసార్ట్‌లకు తరలింపు!
Jharkhand MLAs arrive in hyderabad ఝార్ఖండ్ రాజకీయం హైదరాబాద్‌కు చేరుకుంది. బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న ఝార్ఖండ్ ఎమ్మెల్యేలకు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ఘన స్వాగతం పలికారు.
Jharkhand MLAs arrive in Begumpet Airport: హైదరాబాద్: ఝార్ఘండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుతో రాజకీయాలు మారిపోయాయి. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లడంతో జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ (Champai Soren)ను శాసనసభా పక్షనేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఝార్ఖండ్ సీఎం (Jharkhand)గా చంపై సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా.. జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. అధికార కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలను రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ కు తరలించారు. నగరంలోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఝార్ఖండ్ ఎమ్మెల్యేలకు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలిస్తున్నారు.
కాసేపట్లో హైదరాబాద్‌కు రానున్న ఝార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్, JMM ఎమ్మెల్యేలు
— Telugu Scribe (@TeluguScribe) February 2, 2024
ఇక్కడ వారి క్యాంప్ వ్యవహారాలన్నీ కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ చూసుకోనున్నారు. pic.twitter.com/BORTtjZO3j
సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం
ఝార్ఘండ్ నూతన సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్ భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. 10 రోజుల్లోగా బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ గడువు ఇచ్చారు. చంపై సోరెన్‌తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా, భూ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. మరోవైపు హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు.
హేమంత్ సోరెన్ రాజీనామాతో సంకీర్ణ కూటమి తమ శాసనసభపక్ష నేతగా చంపై సోరెన్ ను ఎన్నుకుంది. దాంతో హేమంత్ సోరెన్ కుటుంబసభ్యులకు సీఎం కుర్చీ దక్కలేదు. సీనియర్ నేత, ఝార్ఖండ్ టైగర్ గా పేరుగాంచిన చంపై సోరెన్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశాక మాట్లాడుతూ.. ఎప్పటికీ హేమంత్ సోరెన్ తమ నాయకుడు అని స్పష్టం చేశారు. ఆయన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటామన్నారు. హేమంత్ సోరెన్ కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.
హైదరాబాద్‌కు చేరిన ఝార్ఖండ్ రాజకీయం
రాజకీయ పరిణామాలతో ఆపరేషన్ ఝార్ఖండ్ బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కు టీపీసీసీ అప్పగించింది. అధిష్టానం ఆదేశాలతో కాంగ్రెస్ నేతలు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు రప్పించారు. గురువారం రాత్రి జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి ఎమ్మెల్యేలు రెండు ప్రత్యేక విమానాలలో హైదారబాద్ కు రావాల్సి ఉంది. అయితే పొగ మంచు కారణంగా.. శుక్రవారం నాడు ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఝార్ఖండ్ అధికార కూటమి ఎమ్మెల్యేలను రిసార్ట్ లకు తరలిస్తున్నారు. మొత్తం 43 మంది ఎమ్మెల్యేలు నగరానికి తరలించి వారికి ఏర్పాట్లు చేస్తున్నారు.