Breaking News Live: తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం - ధాన్యం కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్!
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
దక్షిణ బంగాళాఖాతం నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో మరో రెండు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనుడగా, కొన్ని జిల్లాల్లో ఎండలతో వడగాల్పులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను అలర్ట్ చేశారు. దక్షిణ బంగాళాఖాతంలో మార్పుల ప్రభావంతో ప్రస్తుతం మధ్య ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు వీస్తున్నాయి. ఏపీ, యానాంలో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం నేడు కూడా చల్లగా ఉంటుంది. దక్షిణ బంగాళాఖాత నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఈ ప్రాంతాల్లో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నేడు కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రైతులు ధాన్యం ఆరుబయట నిల్వ ఉంచకూడదని అధికారులు సూచించారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ.. (AP Temperature Today)
రాయలసీమలో, దక్షిణ కోస్తాంధ్రలో ఉక్కపోత, వేడి మరింత పెరగనుంది. ఈ రోజు రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37 నుంచి 41 డిగ్రీల దాక నమోదు కానున్నాయి. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నిన్న కొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. నేటి నుంచి సీమలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Telangana)
బంగాళాఖాతం నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావం తెలంగాణలో కొన్ని జిల్లాలపై ఉంది. హైదరాబాద్ వాసులకు మాత్రం ఎండల నుంచి ఏమాత్రం ఊరట లభించడం లేదు. నిన్న సైతం 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా, వేడి ఉక్కపోత అలాగే ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ లో 41.3 డిగ్రీలు, మెదక్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మరో రెండు రోజుల్లో తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు స్పష్టం చేసింది.
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి నిర్వహించాలని నిర్ణయించింది.
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం మొదలైంది. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న ధాన్యం కొనుగోలు అంశంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇదే కాక మరో 14 అంశాలపైన కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. జీవో నెంబరు 111 పైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Akbaruddin Owaisi Case Verdict: అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసు తీర్పు రేపటికి వాయిదా
Akbaruddin Owaisi Case Verdict: MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తీర్పును నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. దాదాపు పదేళ్ల క్రితం ఈ వ్యవహారం జరిగింది. మజ్లిస్ - ఏ- ఇత్తేహాదుల్ - ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) చేసిన వ్యాఖ్యలు అత్యంత దుమారం రేపాయి. ఆ మాటలు రెండు మతాల మధ్య నిప్పు రాజేశాయి. ఎంతగా అంటే, ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులే సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పదేళ్ల పాటు విచారణ కొనసాగుతూనే ఉంది. ఆ వ్యవహారంలో ఇప్పుడు ఎట్టకేలకు నాంపల్లి కోర్టుతుది తీర్పు ఇవ్వనుంది.
Janasena Rythu Bharosa Yatra: నిట్టూరు బాబు కుటుంబానికి జనసేనాని రూ. లక్ష ఆర్థిక సాయం
Janasena Rythu Bharosa Yatra: గొట్లూరులో కౌలు రైతు నిట్టూరు బాబు కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం
అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ధర్మవరం నియోజవర్గం గొట్లూరులో మైనార్టీ వర్గానికి చెందిన కౌలు రైతు నిట్టూరు బాబు కుటుంబాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాబు వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాబు మరణం తరువాత తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని పవన్ కళ్యాణ్ .. రైతు భార్య మల్లికకు అందజేశారు. ఈ సందర్భంగా కుమార్తెలు ఇద్దరిని పలకరించి, వారి చదువుల గురించి ఆరా తీశారు పవన్. ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలో వారి చదువులకు ఎటువంటి ఆంటకం ఏర్పడకుండా జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
Revanth Reddy: కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయాలి: రేవంత్ రెడ్డి
‘‘కేసీఆర్ కాలక్షేపం, కబుర్లు కట్టిపెట్టి ధాన్యం కొనుగోళ్లపై ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం చేయాలి. 24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ సారథ్యంలో రైతులను కూడగట్టి టీఆర్ఎస్ నేతలను గ్రామాలకు రాకుండా తరిమికొడతాం.’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
కేసీఆర్ కాలక్షేపం కబుర్లు కట్టిపెట్టి ధాన్యం కొనుగోళ్ల పై ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం చేయాలి.
— Revanth Reddy (@revanth_anumula) April 12, 2022
24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలి….
లేనిపక్షంలో కాంగ్రెస్ సారథ్యంలో రైతులను కూడగట్టి టీఆర్ఎస్ నేతలను గ్రామాలకు రాకుండా తరిమికొడతాం.