Indiramma Housing Scheme: తెలంగాణలో నిరుపేదలకు శుభవార్త, 3 విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయం
Ponguleti Srinivas Reddy | తెలంగాణలో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇండ్లు లేని అర్హులైన నిరుపేదలకు మూడు విడతల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Indiramma Housing Scheme In Telangana | గద్వాల: రాష్ట్రంలోని నిరుపేదలు అందరికీ 3 విడతల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలంగాణ రెవెన్యూ మరియు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన శనివారం నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ మంత్రులైన ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరిలతో కలిసి వనపర్తి జిల్లా మంగంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.
గద్వాల జిల్లా కేంద్రంలో 687 మందికి రెండు పడకగదుల ఇళ్ల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల జరిగిన సభల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో రూ.22,500 కోట్ల వ్యయంతో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో పూర్తికాలేని 1,275 ఇళ్లను ప్రస్తుత ప్రభుత్వమే పూర్తిచేసి లబ్ధిదారులకు ఇస్తుందని స్పష్టం చేశారు.
గద్వాలలో నిర్మించిన ఇళ్ల సముదాయంలోని సామాజిక భవనంలో లబ్ధిదారులతో కలిసి మంత్రులు సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో దేవరకద్ర, వనపర్తి, గద్వాల ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలాగే కలెక్టర్లు విజయేందిర బోయి, సంతోష్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు.

అనంతరం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులతో పాటు షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం చేసిన ఆడబిడ్డలు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత వెలకట్టలేనిది..పేద ప్రజల కలలు తీర్చే బాధ్యత దొరకడం మాకు ఒక వరం లాంటిది అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం చేసిన ఆడబిడ్డలు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, వారిలో నిండిన సంతోషం వెలకట్టలేనిది..పేద ప్రజల కలలు తీర్చే బాధ్యత దొరకడం నిజంగా ఒక వరం.
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) September 6, 2025
ఈరోజు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో సహచర మంత్రులు జూపల్లి… pic.twitter.com/n0TqiF1zw7
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకతకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇండ్ల లబ్ధిదారులకే నిర్మాణ దశల ఫొటోలు స్వయంగా అప్‌లోడ్ చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం టీజీహెచ్‌సీల్ (TGHCEL) మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఎలా ఉపయోగించాలి?
- ముందుగా మొబైల్ ఫోన్‌లో ఇందిరమ్మ ఇళ్ల యాప్ టీజీహెచ్‌సీల్ (TGHCEL)ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- లాగిన్ కోసం మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత, డ్యాష్‌బోర్డ్‌లో లబ్ధిదారుడి వివరాలు, నిర్మాణ దశల (గ్రౌండింగ్, బేస్‌మెంట్, వాలింగ్, స్లాబ్, పూర్తి) ఆప్షన్లు కనిపిస్తాయి.
ఫొటోలు ఎలా తీయాలి..
గ్రౌండింగ్ దశ: ఎంపిక చేసిన తర్వాత, ఆ దశకు సంబంధించిన స్థలాన్ని సెలెక్ట్ చేసి, అక్కడి నుంచే మొబైల్ కెమెరాతో జియో ట్యాగింగ్ సహా ఫొటోలు తీయాలి.
మ్యాప్ సింబల్‌ను క్లిక్ చేసి అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి.
ఈ ప్రక్రియ బేస్‌మెంట్, వాలింగ్, స్లాబ్ దశలకూ వర్తిస్తుంది
ప్రతి దశలో మూడు యాంగిల్స్ (ముందు, పక్కన, పై భాగం) నుంచి ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలి.
బిల్లుల ప్రక్రియ ఎలా జరుగుతుంది?
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రతి దశ పూర్తి చేసిన తర్వాత ఆయా దశల ఫొటోలు టీజీహెచ్‌సీల్ (TGHCEL) మొబైల్ యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలి. ఈ ఫొటోలు, సమాచారం గ్రామ కార్యదర్శులు, ఎంపిడిఓలు, డీఈఈలు, పీడీలు తదితర అధికారులు పరిశీలించి ధృవీకరించిన తర్వాతే బిల్లులు విడుదల చేస్తారు.






















